20 August, 2026 | 4:58 PM

274 కిలోమీటర్ల పాదయాత్ర.. కేసీఆర్‌ ఆశీర్వాదం

20-08-2026 04:27 PM

వాంకిడి, 20: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వాంకిడి మండల కేంద్రానికి చెందిన అభిమానులు చేపట్టిన 274 కిలోమీటర్ల పాదయాత్ర ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి, శంకర్‌ అక్కడికి చేరుకున్నారు. అభిమానులు సుదూరం నుంచి పాదయాత్రగా వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న కేసీఆర్‌.. వారికి విశ్రాంతి కోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. విశ్రాంతి తీసుకుని భోజనం చేసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఛాంబర్‌లో ఆయనను కలిశారు.

కేసీఆర్‌ను చూడగానే తిరుపతి, శంకర్‌ భావోద్వేగానికి గురయ్యారు. వీరిద్దరు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దాదాపు 30 నిమిషాల పాటు వారితో కేసీఆర్‌ ఆత్మీయంగా మాట్లాడారు. వాంకిడి మండలంతో పాటు ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని పరిస్థితులు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుపతి, శంకర్‌లను కేసీఆర్‌ సన్మానించారు. తన స్వంత ఇన్నోవా వాహనంలో వారిని తిరిగి వాంకిడి పంపించినట్లు తెలిపారు.