20 August, 2026 | 5:22 PM

నిజాంసాగర్‎లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

20-08-2026 04:47 PM

నిజాంసాగర్ ఆగష్టు 20: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించి, దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, దేశ ప్రగతి కోసం చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

అనంతరం సద్భావన దివస్ ప్రతిజ్ఞ చేసి, కుల, మత, ప్రాంత, భాష భేదాలకు అతీతంగా జాతీయ ఐక్యత, సామరస్యం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితమవడమే ఆయనకు నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.