బోర్డు తిప్పేసిన ‘కిసాన్ పరివార్’
- 6 వేల మంది బాధితులు.. 6 వేల కోట్ల మెగా స్కామ్
- కింగ్ పిన్ భూపాల్ నాయక్ అరెస్ట్
- సైబరాబాద్ సీపీ ఆఫీసుకు పోటెత్తిన బాధితులు
శేరిలింగంపల్లి, జూలై 4 (విజయక్రాంతి): అధిక వడ్డీల పేరిట ఆశ చూపి సామాన్యుల నడ్డి విరిచింది ‘కిసాన్ పరివార్’ సంస్థ. ఆకర్షణీయమైన స్కీమ్‌లతో వల విసిరి ఏకంగా రూ.6 వేల కోట్ల మేర బోర్డు తిప్పేసిన ఈ ఘరానా మోసం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భూపాల్ నాయక్ అనే కేటుగాడు ‘కిసాన్ పరివార్’, ‘షేర్స్ బజార్’ అనే వివిధ పేర్లతో సంస్థలను స్థాపించాడు. 2022 నుంచి పెట్టుబడులు పెట్టిన వారికి మొదట్లో ఏడాది పాటు నమ్మకంగా అధిక వడ్డీలు చెల్లించాడు.
నమ్మకం కుదిరిన బాధితులు తమ జీవితకాల సంపాదనను భారీగా ఇన్వెస్ట్ చేయడంతో.. ప్లాన్ ప్రకారం బోర్డు తిప్పేశాడు. ఈ మెగా స్కామ్‌లో దేశవ్యాప్తంగా సుమారు 6 వేల మంది బాధితులు కాగా, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 1,200 మంది మధ్యతరగతి ప్రజలు సర్వస్వం కోల్పోయారు.
ఈ భారీ కుంభకోణంపై గుజరాత్ పోలీసులు గతంలోనే నిందితుడు భూపాల్ నాయక్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన నిందితుడిని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని గుజరాత్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్‌పై నిందితుడిని హైదరాబాద్‌కు తరలించారు. తమకు జరిగిన అన్యాయంపై శనివారం బాధితులు భారీ సంఖ్యలో సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలివచ్చి ఫిర్యాదు చేశారు.






