30 April, 2026 | 7:05 PM

దక్షిణాదికి వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ కాలరాసింది: కిషన్ రెడ్డి

30-04-2026 04:47 PM

తెలంగాణలో ప్రధాని పర్యటన.. రూ. 7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మే 10న రాష్ట్రంలో  ప్రధాని మోదీ పర్యటన: కిషన్ రెడ్డి

మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక... రాష్ట్రానికి తొలిసారి

హైదరాబాద్: మే 10న తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తెలిపారు. మోదీ మూడో సారి ప్రధాని అయ్యాక రాష్ట్రానికి తొలిసారి వస్తున్నారని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్- యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభమయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని సూచించారు. రూ. 7,823 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. సమ్మక్క-సారక్క ట్రైబల్ వర్సిటీ క్యాంపస్ నిర్మణ పనులు త్వరలో ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు.

వరంగల్ లో ప్రధానమంత్రి కాకతీయ టెక్స్ టైల్స్ పార్కును(Kakatiya Textiles Park) అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్ టైల్ పార్కులు ఉంటే.. అందులో ఒకటి కాకతీయ టెక్స్ టైల్ పార్క్ అన్నారు. 2030 నాటికి రూ,9 లక్షల కోట్ల విలువైన టెక్స్ టైల్ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యమని కేంద్ర మంత్రి వెల్లడించారు. మహబూబ్ నగర్ లో రూ. 3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. మే 10న హైదరాబాద్ లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్, హఫీజ్ పేట, జోగులాంబ రైల్వేస్టేషన్, కాజీపేట- విజయవాడ మధ్య మూడో రైల్వేలైన్ ను ను నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని  కిషన్ రెడ్డి వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే డీలిమిటేషన్ జరగాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కాంగ్రెస్ ఓడించిందని ధ్వజమెత్తారు. సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదన్నారు. దక్షిణాదికి వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ కాలరాసిందని మండిపడ్డారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ సీట్లు పెరగకుండా అడ్డుకున్నారని తెలిపారు.