2 August, 2026 | 1:55 AM

సింగరేణి విషయంలో బద్నాం చేస్తే సహించం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

22-06-2024 05:30 PM

హైదరాబాద్: సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని రాజకీయంగా మాత్రమే వాడుకున్నాయని ఆరోపించారు. సింగరేణి కార్మికుల కష్టాలు తను తెలుసన్నారు. సింగరేణిలో కేంద్రప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని ఆయన పేర్కొన్నారు. బొగ్గును విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి మరింత పెరగాల్సి అవసరం ఉందన్నారు. సింగరేణి విషయంలో కేంద్రప్రభుత్వాన్ని బద్నాం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బొగ్గు, గనులశాఖపై పూర్తిగా అవగాహన పెంచుకుని సింగరేణి రక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సుప్రీం కోర్టు తీర్పుప్రకారమే కేంద్రప్రభుత్వం చట్టం చేసిందన్నారు. బొగ్గు గనులను వేలం వేసుకోవాలని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినప్పటికి పట్టించుకోలేదని చెప్పారు. బొగ్గు గనులకు వేలంపై చట్టం చేసినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు కూడా సభలోనే ఉన్నారని కేంద్రమంత్రి గుర్తుచేశారు. బొగ్గు గనులను వేలం వేసి ఉంటే.. రాష్ట్రానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేదన్నారు. గనులకు వేలం వేసి ఉంటే.. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు వచ్చి ఉండేవని తెలిపారు. ఐరన్ వోర్, సున్నపురాయి గనులకు వేలం వేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వేలం వేయకపోతే కేంద్రం వేలం వేసే అధికారం చట్టంలో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.