12 July, 2026 | 1:50 AM

కిషన్‌రెడ్డి సింగరేణి భరోసా యాత్ర

12-07-2026 12:46 AM
  1.   13, 14 తేదీల్లో చేపట్టనున్న కేంద్రమంత్రి
  2. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  3. నాలుగు జిల్లాల్లో పర్యటన.. మూడు చోట్ల సభలు
  4. ఐదు బొగ్గు గనుల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్స్
  5. యాత్ర వివరాలను ప్రకటించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపుతో సింగరేణి కార్మికులకు, వారి కుటుంబాలకు సంస్థ భవిష్యత్తుపై పూర్తి భరోసా కల్పించడానికి సింగరేణి భరోసా యాత్రను బీజేపీ చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు తెలిపారు. ఈ నెల 13, 14 తేదీలలో ఈ యాత్ర సాగుతుందని, సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభమవు తుందని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మొదట కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుని అక్కడ కార్మికులను కలుస్తారని తెలిపారు. ఆ తర్వాత మణుగూరు మీదుగా ప్రయాణించి, రాత్రికి భూపాలపల్లి చేరుకుని అక్కడే బస చేస్తారన్నారు. ఈ రెండు రోజుల పాటు జరిగే సింగరేణి భరోసా యాత్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనమండలి పక్షనేత ఏవీఎన్‌రెడ్డి, పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, నగేష్, ధర్మపురి అర్వింద్, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొంటారని ప్రకటించారు.

శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునాథరావు యాత్ర వివరాలను వెల్లడించారు. ఈ యాత్రలో 14వ తేదీ ఉదయం భూపాలపల్లిలోని కేటీకే మైన్ వద్ద కార్మికులను కలిసి నాయకులు మాట్లాడతారని, అక్కడి నుంచి తాడిచెర్ల-2 బ్లాక్‌ను సందర్శించి, అనంతరం గోదావరిఖనిలోని ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలిస్తారన్నారు.

ఆ తర్వాత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ (ఎస్‌ఆర్‌పీ) గనిని సందర్శించి, చివరగా మందమర్రి నియోజకవర్గంలో జరిగే సభతో ఈ యాత్ర ముగుస్తుందన్నా రు. ఈ రెండు రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచి ర్యాల.. ఇలా నాలుగు జిల్లాల్లో పర్యటిస్తూ, మూడు చోట్ల బహిరంగ సభలు, ఐదు బొగ్గు గనుల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

సింగరేణిలో పనిచేస్తున్న 41,000 మంది శాశ్వత కార్మికులకు, అలాగే 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. సింగరేణిని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి, కొత్త రెవెన్యూ జనరేట్ చేయడానికే కేంద్రం నైనీ బ్లాకు, తాడిచెర్ల-2 బ్లాకులను కేటాయించిందన్నారు.

భవిష్యత్తులో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణి విస్తరణకు కేంద్రం అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ యాత్రలో పార్టీ ముఖ్య నాయకులతోపాటు బీజేపీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.