సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి
- జెండాలు ఎజెండాలు పక్కన పెట్టాలి
- కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేశాయి
- కెసిఆర్ నిర్ణయాలతో సంస్థ భవితవ్యం 15 ఏళ్లు వెనక్కి వెళ్ళింది
- కార్మికులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- భూపాలపల్లి లో రెండవ రోజు కొనసాగిన యాత్ర
- కేటీకే 8 గని వద్ద సింగరేణి కార్మికులతో సమావేశం
భూపాలపల్లి జూలై 14 (విజయక్రాంతి): కార్మిక సంఘాలన్నీ జెండాలు ఎజెండాలు పక్కనపెట్టి సింగరేణి సంస్థ రక్షణ కోసం కలిసికట్టుగా పనిచేయాలని కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. మంగళవారం రెండవ రోజు సింగరేణి భరోసా యాత్రలో భాగంగా గణపురం మండలంలోని బసవరాజు పల్లి సమీపంలో ఉన్న కేటీకే 8 గని వద్ద సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహించారు. మొదట ఆయన గని ప్రాంగణంలో జెండా ఆవిష్కరించి కార్మికులతో కలిసి ర్యాలీగా సమావేశ స్థలానికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని నేడు సంస్థ పరిస్థితి అప్పుల ఊబిలోఉందని అన్నారు. సింగరేణి సంస్థ నిధులను రెండు ప్రభుత్వాలు కొల్లగొట్టాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి రూ. 500 కోట్ల నిధులను మళ్ళించారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి సంస్థను లాభాల్లోకి తెస్తే రెండు పార్టీలు నేడు సింగరేణి దివాలా తీసేలా చేశారని అన్నారు.
ఎంతో కష్టపడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నప్పటికీ తమ కుటుంబ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న కార్మికుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడాయని తీవ్రంగా విమర్శించారు. రెండు పార్టీలది ఒకే ఏజెండా అని వారి కార్మికుల కోసం చేసిందేమీ లేదని సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోడీ ఎంతో ఆలోచిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల సంక్షేమం కోసం తాము కట్టుబడి పని చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి చీఫ్ రామచంద్రరావు ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






