పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు
పహాని పత్రాలు లేక అప్పుల వేటలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ఇతర రైతులు
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ.. హామీగానే మిగిలింది..
ఉట్నూర్, జులై 14 (విజయక్రాంతి): స్వతంత్రానికి ముందు నుండి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములపై ప్రభుత్వం హక్కులు కల్పించకపోవడంతో పాటు పహాని పత్రాలు అందజేయకపోవడంతో అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 14038 మంది గిరిజనేతర రైతులు 58 259 ఎకరాల సాగు భూమిని తాత ముత్తాతల నుండి సాగు చేసి జీవనం సాగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేత రైతుల కుటుంబాల ఓట్లు దండుకునేందుకు రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో కల్లబొల్లి కబుర్లు చెప్పి ఏజెన్సీ ప్రాంతంలోని దళిత,గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములకు అక్కు పత్రాలు అందించడంతోపాటు బ్యాంకు నుండి పంట రుణాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఏజెన్సీలోని దళిత, గిరిజనేతర రైతులను విస్మరిస్తున్నారని ఏజెన్సీ ప్రాంత రైతులు వాపోతున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో స్వతంత్రానికి ముందు నుండి సాగు చేస్తున్న సాగు భూములకు ప్రభుత్వం గుర్తించకపోవడంతో ఎరువులు దొరకడం లేదని, అదేవిధంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోలేక తొక్కు ధరలకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తమకు నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్, ఖమ్మం తదితర జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులు చేస్తున్న భూములను గుర్తించి పంట రుణాలు పొందేందుకు పహాని పత్రాలు అందించాలని రైతులు కోరుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో నెరవేరని హామీ..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములకు గుర్తింపుని ఇచ్చి పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించుటకు పానీ పత్రాలు అందజేస్తామని హామీ ఇవ్వడంతోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో ఏజెన్సీ ప్రాంతంలోని రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ రుణాలు ఇప్పించారని ఎన్నికల సభలో గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీ ఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనేత రైతులను పట్టించుకోలేదని ఆరోజు విమర్శించారు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజనేత రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు పహాని పత్రాలు అందజేసి బ్యాంకుల నుండి పంట రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు దాటిన గిరిజనేతర రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం లేదని గిరిజనేత రైతులు వాపోతున్నారు. ఒకరకంగా గిరిజనేత రైతులు చేసిన పొరపాటు ఏమిటని రైతులు అంటున్నారు. పొదుపు సంఘాల మహిళలు కోటీశ్వరులు చేస్తామని ప్రభుత్వం అంటుందని, పొదుపు సంఘాల ద్వారా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలంటే మహిళలకు సైతం రుణాలు ఇవ్వడం లేదని, గతంలో తీసుకున్న అప్పులు చెల్లించాలని, అప్పటివరకు కుటుంబంలో ఎవరికి రుణాలు ఇవ్వడం కుదరదని బ్యాంక్ అధికారులు అంటున్నారని ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్, కొమరం భీం జిల్లాలోని జైనూర్, కేరమేరి తదితర మండలాల గిరిజనేత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పు పుట్టడం గగనమే: దుర్గం శ్రీనివాస్, గంగాపూర్, ఉట్నూర్ మండలం..
ఏజెన్సీ ప్రాంతంలో తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పహాని పత్రాలు ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులు పంట రుణాలు ఇవ్వడం లేదు. వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్తే వారు సైతం అప్పులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. పొదుపు సంఘాల మహిళల ద్వారా రుణం పొందుతే గత అప్పులు కడితే మహిళల పేరుతో రుణం ఇస్తామని బ్యాంక్ అధికారులు తిప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్దామంటే సీఎం వద్దకు వెళ్లలేక పోతున్నాం. గిరిజనేతర రైతులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకుపోయే నాయకులే తమకు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి గిరిజనేతర రైతులకు న్యాయం చేయాలి.
ఎరువులు దొరకడం లేదు: మనోహర్, రైతు, ఇంద్రవెల్లి..
పంటల సాగు కోసం అవసరమైన ఎరువులు కొనుగోలు చేయాలంటే ఆన్లైన్ ద్వారా భూమి వివరాలు నమోదు చేయాలి. ఆన్లైన్లో తాము చేసుకుంటున్న భూముల వివరాలు లేకపోవడంతో ఎరువులు దొరకడం లేదు. పట్టా భూమి ఉన్న రైతుల పేరుతో ఎరువులు కొనుగోలు చేయాలంటే వారికి బస్తాకు 200 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో తాత ముత్తాతల నుండి జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తమకు పహాని పత్రాలు అందించి పంట రుణాలు, ఎరువులు అందించాలని కోరుకుంటున్న.






