3 July, 2026 | 4:06 PM

రైజర్స్ రన్నరప్‌తో సరి కేకేఆర్ తీన్మార్

27-05-2024 01:54 AM

ఐపీఎల్- చాంపియన్ కోల్‌కతా

సీజన్ ఆసాంతం రాణించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడింది. పదేళ్లుగా మూడో టైటిల్ కోసం వేచిచూస్తున్న కేకేఆర్.. సన్‌రైజర్స్‌ను తుక్కు కింద కొట్టి సగర్వంగా కప్పు ఒడిసి పట్టింది. మొదట బౌలింగ్‌లో భళా అనిపించిన కోల్‌కతా..ఆ తర్వాత సునాయాస లక్ష్యాన్ని  రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది!

లీగ్ దశలో ప్రత్యర్థులను భయపెట్టే స్కోర్లతో విజృంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతోనే తొలి తప్పు చేసిన రైజర్స్.. రెండు ఓవర్లలోపే విధ్వంసక ఓపెనర్లు హెడ్, అభిషేక్ వెనుదిరగడంతో ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 

బెంబేలెత్తించే బౌలింగ్‌తో విజృంభించిన కోల్‌కతా.. బ్యాటింగ్‌లోనూ అలసత్వానికి తావివ్వకుండా చెలరేగిపోయింది. క్వాలిఫయర్ విజేతగా నిలిచిన జట్టే కప్పు నెగ్గే సంప్రదాయం మరోసారి కొనసాగగా.. గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశకత్వంలో కోల్‌కతా మూడోసారి చాంపియన్‌గా అవతరించింది. 

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చాంపియన్‌గా నిలిచింది. గతం (2012, 2014)లో రెండు సార్లు కప్పు నెగ్గిన కోల్‌కతా.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీ హస్తగతం చేసింది. ఆదివారం చెన్నై చెపాక్ వేదికగా జరిగిన ఏకపక్ష ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. మూడోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడిన రైజర్స్.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. సీజన్ మొత్తం రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన హైదరాబాద్.. తుదిపోరులో ఉసూరుమనిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్  కమిన్స్ (24; 2 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. మార్క్మ్ (20) ఒక్కడే ఇరవై పరుగుల మార్క్ చేరాడు.

స్టార్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (2) విఫలం కాగా.. రాహుల్ త్రిపాఠి (9), నితీశ్‌రెడ్డి (13), హెన్రిచ్ క్లాసెన్ (16), షాబాజ్ అహ్మద్ (8), సమద్ (4) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు.కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 3, స్టార్క్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ దుమ్మురేపిన స్టార్క్.. ఇక్కడ కూడా అదే జోరు కనబర్చడంతో రైజర్స్ కోలుకోలేకపోయింది. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో మెరవగా.. రహ్మనుల్లా గుర్బాజ్ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ చెరో వికెట్ తీశారు. స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

సంక్షిప్త స్కోర్లు

హైదరాబాద్: 18.3 ఓవర్లలో 113 ఆలౌట్ (కమిన్స్ 24; రస్సెల్ 3/19, స్టార్క్ 2/14), కోల్‌కతా: 10.3 ఓవర్లలో 114/2 (వెంకటేశ్ 52 నాటౌట్, రహ్మానుల్లా 39; కమిన్స్ 1/18).

ఐపీఎల్- అవార్డుల వీరులు

ఎమర్జింగ్ ప్లేయర్            నితీశ్ కుమార్‌రెడ్డి                      10 లక్షలు

స్టార్ స్ట్రయికర్ జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ 10 లక్షలు

అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ సునీల్ నరైన్ 10 లక్షలు

అత్యధిక సిక్సర్లు అభిషేక్ శర్మ 10 లక్షలు

అత్యధిక ఫోర్లు ట్రావిస్ హెడ్ 10 లక్షలు

అత్యుత్తమ క్యాచ్ రమన్‌దీప్ సింగ్ 10 లక్షలు

ఫెయిర్ ప్లే అవార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 లక్షలు

మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సునీల్ నరైన్ 10 లక్షలు

అత్యుత్తమ పిచ్ ఉప్పల్, హైదరాబాద్ 50 లక్షలు