21 June, 2026 | 1:29 AM

సంస్కృత భాషాకోవిదుడు కోలాచలం మల్లినాథసూరి

21-06-2026 12:49 AM

సంస్కృత భాషాకోవిదుడుగా కోలాచలం మల్లినాథసూరి ప్రసిద్ధి చెందాడు. భారతదేశంలోనే ప్రజ్ఞావంతుడిగా ఆయనను కొనియాడుతారు. మల్లినాథుడు సంస్కృత పంచకావ్యాలకు సంజీవనీ, ఘంటాపథ, సర్వంకష వ్యాఖ్యలు రాసిన మహాపండితుడు. కాకతీయ ప్రతాపరుద్రుడిచే కనకాభిషేక గౌరవం పొందిన వ్యక్తి. మెదక్ జిల్లా కొల్చారంలోని ఆయన ఇల్లు సంస్కృత విద్యాకేంద్రంగా విలసిల్లింది.

  1. భారతదేశంలోనే ప్రజ్ఞావంతుడు 
  2. కాకతీయ ప్రతాపరుద్రుడిచే కనకాభిషేక గౌరవం
  3. సంస్కృత విద్యాకేంద్రంగా మెదక్ జిల్లా కొల్చారంలోని ఆయన ఇల్లు 

14.05.16న నేను వేముగంటి మురళీకృష్ణ, చంటి, మిత్రుడు, గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు మోహన్‌రెడ్డి సార్‌లతో కలిసి మెదక్ జిల్లా కొల్చారం, కుల్చారం, కొలిచెలిమె, కోలాచలం అని పిలువబడుతున్న గ్రామానికి వెళ్లాం. కొల్చా రం ‘కోలాచలం మల్లినాథసూరి’ జన్మస్థలం. మల్లినాథుడు సంస్కృత పంచకావ్యాలకు (1.రఘువంశం, 2. కుమారసంభవం, 3.మేఘసందేశం -కాళిదాసు రచనలు 4. కిరాతార్జునీ యం-భారవి రచన 5. శిశుపాలవధ-మాఘుని రచన) సంజీవనీ, ఘంటాపథ, సర్వంకష వ్యాఖ్యలు రాసిన మహాపండితుడు.

భారతదేశంలోనే మల్లినాథుని వంటి ప్రజ్ఞావంతుడు మరొకరు లేరని చెప్పవచ్చు. మొత్తం 15 సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యలు రాసినవాడు, 19 శా్రస్త్రాల పారీణత కలవా డు, 5 స్వీయరచనలు చేసినవాడు, పండితవంశంలో పుట్టినవాడు, తెలంగాణాలో ఇంతటి సంస్కృత భాషాకోవిదుడు మరొకరు మనకు కనిపించడు. కొల్చారంలోని వారిల్లే తరతరాలుగా గొప్ప సంస్కృత విద్యాకేంద్రం. 

మల్లినాథుడికి యోగి మంత్రోపదేశం

మల్లినాథుడు చిన్నపుడు విద్యాగంధం అబ్బక వూరికి దక్షిణాన వున్న తిరుమలకుచ్చకు పసులను తోలుకుని పోయి కాసేవాడట. ఆ గుట్టగుహలో తపస్సు చేసుకుంటున్న ఒక సిద్ధయోగికి ఆవుపాలు పోసి, ఆహారమిచ్చి సేవలు చేశాడట. దానికి మెచ్చి ఆ యోగి మల్లినాథుడికి సారస్వత మంత్రోపదేశం చేసినందువల్లనే మల్లినాథుడు విద్యావంతుడై కాశీలో చదివి యోగ్యుడై తిరిగి గ్రామం చేరి, అప్పటిదాకా ఎవరికి అర్థం కాని కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యలు రాసినాడట.

పితామహుడు మల్లినాథుడు శతావధాని. కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తిచే కనకాభిషేక గౌరవం పొందినాడట. తండ్రి కపర్థిస్వామి ‘ఆపస్తంబ శ్రౌతకల్ప గృహ్య సూత్రాల’కు భాష్యం రాసినవాడు. తాను సంస్కృతం నేర్పే విద్యార్థుల కోసం సంస్కృత పంచకావ్యాలకు వ్యాఖ్యలు రాసినవాడు మల్లినాథ‘సూరి’. 

మల్లినాథుడి ముగ్గురి పుత్రులు

మల్లినాథుడికి ముగ్గురు కుమారులు. మొదటివాడు పెద్దయార్యుడు(పెద్దిభట్టు), రెండవ కుమారుడు కుమారస్వామి (సోమపీథి) ప్రతాప రుద్రీయానికి రత్నాపణ వ్యాఖ్య రాసి సర్వజ్ఞ సింగభూపాలుని చేత సత్కారమందిన వాడు. మూడ వ కుమారుడు గిరినాథుడు నృసింహ విరచిత స్వరమనోజ్ఞ మంజరికి వ్యాఖ్య రచించిన వాడు. ఈ సంస్కృత పండితుల చేత వాసికెక్కిన గ్రామం కొల్చారం.

ఈ వూరి చావడి పక్కన లభించిన శాసనం వల్ల జయంతిపురం రాజధానిగా ఏలుతు న్న త్రిభువన మల్లదేవుని కాలంలో (క్రీ.శ.1116 జూలై 24న) అతని దండనాథుడైన గుండనాయకుడు బ్రాహ్మణులైన మాధవ భట్టోపాధ్యాయునికి, కుమారస్వామిభట్టునికి మెదకులో కొంతభూమిని దానమిచ్చినట్లు తెలుస్తున్నది. ఇది నిస్సందేహంగా మల్లినాథసూరి వంశీయులకిచ్చినదే కావచ్చునని మా అభిప్రాయం. గ్రామంలో మల్లినాథుని వంశీ యులు వున్నారు. కోలాచల కాశీనాథశర్మ గారింటిని చూసాం. ఆ ఇంటికెదురుగా మల్లినాథసూరి నివసించిన ఇంటిజాగ వుంది.

కొల్చారంలో కొలువైన జైన తీర్థంకరుడు

కొల్చారంలో జైన పార్శ్వనాథుని విగ్రహం లభించిన ప్రదేశం పక్కన సుందరమైన వీరభద్రుని ఆలయం వుంది. శిల్పం మనోజ్ఞంగా వుంది. ఆలయ ద్వారానికి లలాటబింబంగా గజలక్ష్మి వుంది. ఇది చాళుక్యుల సంప్రదాయమే. ప్రధానాలయానికి ఇరువైపుల ఉపాలయాలున్నాయి. అందులో విగ్రహాలు మారినట్లున్నాయి. ఎన్నో వీరగల్లులు వీరభద్రుని గుడి చుట్టు ముట్టే బయట పారేసివున్నాయి. దేవాలయ ద్వారబంధం, మూలవిరాట్టు పై నుంచే మకరతోరణం, నాగ, నాగినీ శిల్పాలు, 4 అడుగుల ఎత్తున్న వినాయకుడు దేవాలయ ప్రాంగణం అవతల పడి వున్నాయి.

జైన విగ్రహం దొరికిన చోట మట్టిలో విరిగిపడి వున్న ఆలయద్వారం లలాటబింబంగా గజలక్ష్మే వుండటం విశేషం. గజలక్ష్మిని జైనదేవతగానే చెపుతుంటారు జైనులు. దొరికిన (విఘ్ననాశక)పార్శ్వనాథుని విగ్రహం వూరిబయట రోడ్డుపక్కన కొత్తగా నిర్మించిన జైనాలయంలో ప్రతిష్టించారు. ఈ ప్రదేశాన్ని ‘యాపపురం’ అంటారు. ఈ గుడి దిగంబరజైనశాఖకు చెందిన యాపనీయులది. ఈ విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుంటుంది. నల్ల(సాన)రాతి శిల్పం. కాయోత్సర్గ భంగిమలో వుంది. విగ్రహపాదపీఠంపై ‘శ్రీ చాళుక్యకులతిలకం తైలపరసర్’ అని వుంది. కళ్యాణీ చాళుక్యుల మూలపురుషుడైన రెండవ తైలపుడు(క్రీ.శ.973) నిలిపిన జైనదేవాలయంలోనిదే పార్శ్వనాథుని విగ్రహం. 

తిరుమలాయ కుచ్చ

కొల్చారానికి దక్షిణదిశలో తిరుమలాయకుచ్చ మీద వెంకటేశ్వరుని గుహాలయం వుంది. గుడిలోని విగ్రహాలను దొంగలు దోచుకుపోతే కొత్త విగ్రహాలను ఆ స్థానంలో ప్రతిష్టించారట. ఈ గుహాలయం సిద్దిపేట బయట చిన్నగుట్టపై వున్న రంగనాయకుని గుహాలయం వలెనె వుంది. మల్లినాథునికి మంత్రోపదేశం చేసిన ముని తపస్సు చేసిన చోటును గ్రామస్థులు చూపించారు. మల్లినాథుడు తపస్సు చేసిన చోటు మరోచోట వుందట. గుడి దిగువన కొలిచెలిమె అని పిలిచే కొలను అవశేషం వుంది. గ్రామానికి ఆ పేరు రావడానికి మూలకమైన కొలను ఇదే.

కొల్చారంలో దేవతా శిల్పాలు, కోట

ఆ ఆలయ ప్రాంగణంతలోనే గ్రామస్థులు చెక్కించి సిద్ధపరిచిన ‘మల్లినాథసూరి’ విగ్రహం ప్రతిష్టకై నిరీక్షిస్తున్నది. కొల్చారం గ్రామం చుట్టు ఒకప్పుడుండిన మట్టికోటగోడల దిబ్బలిప్పటికి అగుపిస్తున్నాయి. కొల్చారానికి నాలుగు దిక్కుల్లో నాలుగు గైన్లు(గవనులు, కోటద్వారాలు), కోటచు ట్టు కందకం వున్న ఆనవాళ్లు ఉన్నాయి. కోట బయటపెరిగిన ఇప్పటి గ్రామాన్ని ప్రజలు అవతలికోట అని పిలు స్తున్నారు. అవతలికోట ద్వారానికి ఇరువైపులా రెండు అమ్మదేవతల గుళ్లున్నాయి.

ఉత్తరదిశలో వున్న గుడిలోని అమ్మదేవత గుహ్య యోగాసనముద్రలో వుంది. కిరీటధారి, చతుర్భుజియైన దేవత నాలుగుచేతుల్లో ముందరి కుడిచేతిలో ఖడ్గం, వెనకచేతిలో ముందరి ఎడమచేతిలో గిన్నె, వెనక చేతిలో త్రిశూలం వున్నాయి. నడుముకు వడ్డాణం, మోకాళ్ల వరకు అంగవస్త్రం, వక్షం అనాచ్ఛాదితంగా వుంది.

రాక్షసుని శిరస్సుపై మడిచిన ఎడమకాలివేళ్లను మోపి నిలిచి, ఎడమకాలి మడిమపై కుడికాలివేళ్లను మడిచి నిలిపి కుడికాలి మడిమను గుహ్యస్థానాన్ని తాకించి వుంచిన ఆసనస్థితిలో వుంది. కాలికింద శిరస్సు కలిగిన ఈ దేవత కామాక్షి(కామాఖ్య) అవుతుందని కపిలవాయి లింగమూర్తి చెప్పారు. అరుదైన శిల్పం. మరొక పక్క దక్షిణాన మరో అమ్మదేవతగుడి. అందులో పై అమ్మవారిలాంటి రూపమే. ఆసనస్థితిలో మార్పు. రెండుపాదాల వేళ్లను మడిచి కూర్చున్న భంగిమ.