చదువులమ్మ ఒడి.. కలువల బడి
ఇంటి చెంతనే ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ బడిలో తమ పిల్లలకు సీటు దొరికితే వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లేననే నమ్మకం నాటుకుపోయింది. తల్లిదండ్రుల నమ్మకానికి తగ్గట్టుగానే.. కొన్నేళ్లుగా చదువుల తల్లి ఒడిగా.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కలవల ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలు కీర్తి గడించాయి. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులు చాలా కాలంగా అంకితభావంతో విద్యాబోధన చేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు.
ఆ పాఠశాలకు సమీపంలోని గ్రామాల్లోని పిల్లలను తల్లిదండ్రులు కలవల ప్రభుత్వ బడిలో చేర్చేందుకు ఆసక్తి చూపిస్తు న్నారు. దీంతో కల్వల ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలు జిల్లాలో ఎక్కడ లేని విధంగా అత్యధిక 350 మందికి పైగా విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వర కు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తుండటంతో పాటు అందులో చదివే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అంకితభావంతో, వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ నూటికి నూరు శాతం ఫలితాలను సాధిస్తున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధిం చేందుకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయులు, దాతల సహకారంతో కృషి చేస్తున్నారు. చుట్టుపక్కల మూడు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తారా సింగ్ తండా, అమీనాపురం, క్యాంపు తండా, గాంధీనగర్, నారాయణపురం, కాశీరామ్ తండా గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను తమ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నా అక్కడ కాకుండా ఈ పాఠశాలకు పంపిస్తున్నారంటే ఆ పాఠశాల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాసర త్రిపుల్ ఐటీకి విద్యార్థులు
2023-24 ఆంగ్ల మాధ్యమంలో40 మందికి 40 మంది, తెలుగు మీడియంలో 20 మందికి 16 మంది పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు కే.హరిణి బాసర త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది. ఇక 2024-25 సంవత్సరంలో ఆంగ్ల మాధ్యమంలో 36 మందికి 36 మంది, తెలుగు మీడియంలో 12 మందికి 12 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో కే.తేజస్విని, వై.వెన్నెల, జీ.శివాని త్రిబుల్ ఐటీలో సీట్లు సాధించారు.
2025 ఆంగ్ల మాధ్యమంలో 22 మందికి 22 మంది, తెలుగు మీడియంలో 11 మందికి 11 మంది పదో తరగతిలో పాసయ్యారు. ఎం.సహారా, బీ.నవ్య, బీ. అనూష త్రిబుల్ ఐటీ బాసరలో సీటు సాధించారు.
పాఠశాలల ప్రత్యేకతలు
పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన. పూర్వ విద్యార్థులకు తెలుగు మీడియంలో విద్యాబోధన కొనసాగింపు. ప్రభుత్వం సమకూర్చిన వసతులను సక్రమంగా వినియోగించడంతో పాటు పాఠ శాలలో ప్రత్యేకంగా మూడు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ల ద్వారా సాంకేతిక ఆదారిత విద్యాబోధన. కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు సకల వసతుల కల్పన. ఆధునిక పరికరాలతో
సైన్స్ ల్యాబ్, నిరంతరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ ప్రయోగాత్మక అభ్యాసన కోసం కృషి. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం. ఉదయం సాయంత్రం స్పెషల్ క్లాసులు, మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి సహకారంతో వారికి స్నాక్స్ ఏర్పాటు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మిడ్ వెస్ట్ గ్రానైట్ సంస్థ ద్వారా 39 సైకిల్లు, అలాగే పలు సంస్థలు జీఆర్ ఇన్ఫోటెక్, రాజస్థాన్ సంస్థ నుంచి అదనంగా 20 సైకిళ్లు, రెండు కంప్యూట ర్లు, పిల్లలకు సురక్షితమైన శుద్ధిచేసిన తాగునీరు అందించడానికి ప్యూరిఫైడ్ యూనిట్ ఏర్పాటు.
పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించే విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించి చిన్నతనం నుండే పోటీ పరీక్షల్లో రాణించే విధంగా తర్ఫీదు. ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయిలో మెరిట్ స్కాలర్షిప్ సాధించి, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల నమ్మకానికి అనుగుణంగా ఫలితాలు సాధిస్తూ కల్వల ప్రభుత్వ పాఠశాలలు వందల మంది విద్యార్థులతో నిత్యం కళకళలాడుతూ ‘ఆదర్శ’వంతంగా నిలుస్తున్నాయి.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్ విజయక్రాంతి






