13 May, 2026 | 2:13 AM

కోల్‌కథ ఏమవుతుందో ?

13-05-2026 12:37 AM

బెంగళూరుతో కీలక పోరు

టాప్ 2లో ఉన్న ఆర్‌సీబీ

రాయ్‌పూర్, మే 12 : ఐపీఎల్ 19వ సీజన్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకున్న కేకేఆర్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే కోల్ కతా ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా చేజారినట్టే. ప్రస్తుతం ఆ జట్టు 10 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 9 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్ మిగిలిన అన్ని మ్యాచ్‌లలో గెలిచి రన్ రేట్ మెరుగుపరుచుకుంటే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది.

గత రెండు మ్యాచ్ లలో సన్‌రైజర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయాలతో కోల్ కతాకు ఫుల్ జోష్ వచ్చింది. రహానే కెప్టెన్సీలోని ఆ జట్టు బౌలర్లు ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. అంకుల్ రాయ్ , వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి పేస్ విభాగంలో ఢిల్లీపై అదరగొట్టారు. అటు స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ చక్రవర్తి కూడా తమ మ్యాజిక్ చూపిస్తున్నారు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతోనే ఢిల్లీపై భారీ విజయాన్ని అందుకోగలిగింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ బెర్తుకు చేరువైంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరినట్టే. ప్రస్తుతం ఆర్సీబీ 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బ్యాటర్లు తడబడినా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా, టెయిలెండర్ భువనేశ్వర్ అద్భుత పోరాటంతో గెలిపించారు. దీంతో మరోసారి అటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రద ర్శన కనబరచాలని ఎదురుచూస్తోంది. భువనేశ్వర్ , హ్యాజిల్ వుడ్ , సలామ్ దార్ అద్భు తమైన బౌలింగ్‌తో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా వెటరన్ పేసర్ భువనేశ్వర్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కేకేఆర్‌కు పెద్ద సవాల్‌గానే చెప్పాలి. 

తుది జట్ల అంచనా

బెంగళూరు :

కోహ్లీ, బెథెల్/సాల్ట్, పడిక్కల్, పటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, హ్యాజిల్‌వుడ్

కోల్‌కతా :

రహానే (కెప్టెన్), నరైన్, రఘువంశీ, గ్రీన్, పావెల్ , రింకూ సింగ్, అంకుల్ రాయ్, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, వరుణ్ చక్రవర్తి