గుడి స్థలానికి దొంగలు?
తిరుమల మేడోస్, సాయికృష్ణ లేఅవుట్ గుడి స్థలం విక్రయం?
బయటకు తెలిసింది 300 గజాలు.. ఎసరు పెట్టింది 1000 గజాలు
పూజలు అందుకుంటున్న గుడి స్థలానికీ విక్రయ యత్నాలు కాలనీవాసుల ఫిర్యాదుతో బట్టబయలైన వ్యవహారo
మేడిపల్లి,(విజయక్రాంతి): కాలనీ లేఅవుట్‌లో గుడి, పార్కు కోసం కేటాయించిన స్థలానికే కొందరి కన్ను పడిందన్న ఆరోపణలు తిరుమల మేడోస్ కాలనీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏళ్లుగా స్థానికులు పూజలు నిర్వహిస్తున్న మైసమ్మ గుడి ఉన్న స్థలంతో పాటు పార్కు కోసం కేటాయించిన భూమిపై విక్రయ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థలం విక్రయ వ్యవహారంపై కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి విక్రయించిన వారిపై కేసు నమోదు చేసినట్లు వారు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా తిరుమల మేడోస్ కాలనీకి చెందినవారే కావడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. లేఅవుట్ స్వరూపం, గుడి ఉనికి, పార్కు స్థలం వంటి విషయాలు తెలిసినప్పటికీ కొనుగోలు చేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బోడుప్పల్‌లోని తిరుమల మేడోస్ పరిధిలోని ఈ గుడిలో కొన్ని సంవత్సరాలుగా గ్రామస్థులు, స్థానికులు పూజలు నిర్వహిస్తున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. స్థానికుల ఆచారాలు, పూజా కార్యక్రమాలతో కొనసాగుతున్న ఈ స్థలాన్ని మైసమ్మ గుడిగా గుర్తించి పూజలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. కాలనీ లేఅవుట్ పత్రాల్లో గుడి, పార్కు కోసం స్థల కేటాయింపులు ఉన్నాయని కాలనీవాసులు చెబుతున్నారు.
దీనికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైన సమయంలో అధికారులకు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నారు. ఈ స్థలాన్ని వ్యక్తిగత క్రయవిక్రయాలకు గురిచేయడం ఎలా సాధ్యమైందని వారు ప్రశ్నిస్తున్నారు. గుడి ఉన్న విషయం తెలిసినప్పటికీ స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చారా? వారి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో కొనుగోలుదారులు కూడా అదే కాలనీకి చెందినవారేనని స్థానికులు చెబుతున్నారు. కాలనీలో ఏళ్లుగా ఉన్న గుడి, దాని వద్ద జరిగే పూజలు, లేఅవుట్‌లోని పార్కు స్థలం గురించి వారికి తెలిసి కూడా కొనుగోలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 300 గజాల వ్యవహారం బయటపడడంతో పెద్దల సమక్షంలో వాటిని రద్దు చేసుకుంటామని చెప్పినట్లు సమాచారం.
అయితే మిగిలిన సుమారు 700 గజాలను బంధువుల పేర్లపైకి మార్చుకుని, తాము లక్షల్లో నష్టపోయామని చెబుతూ వ్యవహారాన్ని వదిలేయాలని పెద్దలను ఆశ్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాలనీవాసుల ఫిర్యాదుతో విక్రయించిన వారిపై కేసు నమోదు చేసినప్పటికీ, కొనుగోలుదారులపై సమాన స్థాయిలో విచారణ జరగకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక లావాదేవీలో విక్రేత, కొనుగోలుదారు ఇద్దరి పాత్రను పరిశీలించాల్సి ఉంటుందని, కేవలం ఒక వర్గంపై చర్యలు తీసుకుని మరొక వర్గాన్ని వదిలేయడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
ఎంతటి వారినైన వదిలిపెట్టొద్దు
గుడి స్థలాన్ని కబ్జాచేయడం సిగ్గుచేటు, దేవుడి భూమినే కబ్జా చేస్తున్నారంటే ప్రజల స్థలాలకు రక్షణ లేకుండా పోతుంది. గుడి,పార్కు స్థలాన్ని అమ్మిన వారిపై కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
మీసాల క్రిష్ణ, బీఆర్ఎస్ ప్రదాన కార్యదర్శి






