5 July, 2026 | 4:34 PM

అయ్యో రైజర్స్

22-05-2024 02:11 AM

క్వాలిఫయర్ పరాజయం 

ఫైనల్ చేరిన కోల్‌కతా 

కీలక పోరులో సన్‌రైజర్స్ ఉసూరుమనిపించింది! పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఇరు జట్ల మధ్య సమరం రసవత్తరంగా సాగుతుందని భావిస్తే.. పూర్తి ఏకపక్షంగా మారి నిరుత్సాహ పరిచింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్‌ల వైఫల్యం హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బకొట్టగా.. కోల్‌కతా పాతిక కోట్లు పెట్టి కొన్న స్టార్క్ కీలక పోరులో అదుర్స్ అనిపించాడు. బ్యాటింగ్‌లో మెరిపించలేకపోయిన సన్‌రైజర్స్.. బౌలింగ్‌లో ఏదైనా మ్యాచ్ మ్యాజిక్ చేస్తుందేమో అనుకుంటే అదీ అత్యాశే అయింది. ఈ ఫలితంతో కోల్‌కతా నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. తుదిపోరుకు చేరేందుకు క్వాలిఫయర్ రూపంలో హైదరాబాద్‌కు మరో అవకాశం ఉంది.

అహ్మదాబాద్: భారీ అంచనాల మధ్య క్వాలిఫయర్‌ొో1లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భంగపాటు ఎదురైంది. లీగ్ దశలో ప్రత్యర్థులతో సంబంధం లేకుండా భారీ స్కోర్లతో బెంబేలెత్తించిన రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్.. కీలక పోరులో తడబడింది. ఫలితంగా మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న కోల్‌కతా.. ఆ తర్వాత ఓ మాదిరి లక్ష్యాన్ని చూస్తుండగానే ఊదేసింది. దీంతో ఆదివారం జరగనున్న మెగా ఫైనల్‌కు కోల్‌కతా నేరుగా అర్హత సాధించింది. ఇక హైదరాబాద్ తుదిపోరుకు చేరాలంటే.. ఎలిమినేటర్‌లో విజేతగా నిలిచిన జట్టుతో శుక్రవారం క్వాలిఫయర్ నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.

రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించగా.. క్లాసెన్ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ పాట్ కమిన్స్ (30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కాస్త పోరాడారు. విధ్వంసక ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (3) ఘోరంగా విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0), అబ్దుల్ సమద్ (16), సాన్వీర్ సింగ్ (0) ప్రభావం చూపలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో మిషెల్ స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అల్లాడించగా.. రహమానుల్లా గుర్బాజ్ (23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సునీల్ నరైన్ (21; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. మన బౌలర్లలో కమిన్స్, నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు.  స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం జరగనున్న ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

అయ్యర్ ద్వయం అదుర్స్..

తాజా సీజన్‌లో నిలకడకు మారుపేరుగా మారిన కోల్‌కతా సునాయాస లక్ష్యఛేదనలో ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. సాల్ట్ అందుబాటులో లేకపోయినా.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్ మెరుపులతో ఇన్నింగ్స్ ఆరంభించడంతో మూడు ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 44 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత రహ్మానుల్లా, నరైన్ ఔటైనా.. అయ్యర్ ద్వయం (వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్) బాదే బాధ్యత తీసుకున్నారు. సాధించాల్సిన పరుగులు ఎక్కువ లేకపోవడం తో చెత్త బంతులపై విరుచుకుపడిన ఈ జోడీ బౌండ్రీలతో మైదానాన్ని హోరెత్తించింది. గత మ్యాచ్‌ల్లో ప్రభావవంతంగా కనిపించిన హైదరాబాద్ బౌలింగ్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. దీంతో ఎడాపెడా సిక్సర్లు బాదిన ఈ జంట చూస్తుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

ఆదిలోనే హంసపాదు

కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కమిన్స్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ సీజన్‌లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు ఆకాశమే హద్దుగా చెలరేగి ఒకటికి మూడుసార్లు 250+ స్కోర్లు చేసిన హైదరాబాద్.. మరోసారి విశ్వరూపం చూపుతుందని ఆశిస్తే అది అత్యాశే అయింది. కోల్‌కతా పాతిక కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న కంగారూ పేసర్ స్టార్క్.. కీలక మ్యాచ్‌లో తన విలువ చాటుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే హైదరాబాద్ బ్యాటింగ్ మూల స్తంభం ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. గత మ్యాచ్‌లోనూ హెడ్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటైనా.. మరో ఓపెనర్ అభిషేక్ అదరగొట్టడంతో అభిమానుల మనసుల్లో ఏమూలో ఆశలు చిగురించగా.. రెండో ఓవర్‌లో వైభవ్ అరోరా వాటిని చిదిమేశాడు. సీజన్ అత్యధిక సిక్సర్ల వీరుడిగా నిలిచిన అభిషేక్‌ను అతడు బుట్టలో వేసుకున్నాడు. దీంతో 13 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన హైదరాబాద్ ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడినా.. నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ ఇలా వచ్చి అలా వెళ్లారు. క్లాసెన్ కుదురుకోవడంతో భారీ స్కోరు సాధ్యమనుకుంటే.. కోల్‌కతా స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులతో వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. ఆఖర్లో కమిన్స్ కాస్త బ్యాట్‌కు పనిచెప్పడంతో రైజర్స్ గౌరవప్రద స్కోరు చేయగలిగింది.