ఎలిమినేట్ అయ్యేదెవరు?
నేడు రాజస్థాన్, బెంగళూరు ఢీ
గెలిచిన జట్టు క్వాలిఫయర్
తుది అంకానికి చేరిన ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ పోరు జరగనుంది. అంటే ఓడిన జట్టు నేరుగా ఇంటికి వెళితే.. గెలిచిన జట్టు క్వాలిఫయర్ చేరుకుంటుంది. ఒత్తిడిని జయించి ఆరు వరుస విజయాలతో అనూహ్యంగా దూసుకొచ్చిన బెంగళూరును రాజస్థాన్ ఏ మేరకు నిలవరిస్తుందో చూడాలి!!
తొలి అంచె పోటీల్లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలు.. ఇది చూశాకా లీగ్ నుంచే నిష్క్రమించే తొలి జట్టు ఇదే అని ఎవరైనా అనుకుంటారు. ఇంకొక్క ఓటమి చవిచూస్తే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించే స్థితిలో ఆ జట్టు అద్భుతం చేసింది. ఆశలు అడుగంటిన వేళ వరుసగా ఆరు విజయాలు సాధించి ఔరా అనిపించిన ఆ జట్టే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ బరిలోకి దిగిన బెంగళూరు తొలుత పేలవ ప్రదర్శనతో అట్టడుగున నిలిచినప్పటికి రాను రాను సాన పెట్టిన వజ్రంలా తయారై ప్రమాదకరంగా మారింది!
అహ్మదాబాద్: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య ఎలిమినేటర్ పోరు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధించి క్వాలిఫయర్ అడుగుపెడతారన్నది ఆసక్తికరం. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో రెచ్చిపోయిన రాజస్థాన్ ఆ తర్వాత పూర్తిగా లయ తప్పింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలను మూటగట్టుకొని ఆత్మరక్షణలో పడింది.. లీగ్ దశను 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించిన రాజస్థాన్ మూడో స్థానంతో ముగించింది. ఇక బెంగళూరు లీగ్ దశలోని 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ ఆడనుండగా.. ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమించనుంది.
కోహ్లీ ఒక్కడే ..
ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కు వచ్చిందంటే అదంతా కోహ్లీ చలవే. జట్టు పూర్తిగా విఫలమైనా తాను మాత్రం బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తన అమూల్యమైన ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీని గెలిపించాడు. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన కోహ్లీ 155.60 స్ట్రయిక్‌రేట్‌తో 708 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కోహ్లీ ఇచ్చిన స్పూర్తితో కెప్టెన్ డుప్లెసిస్, రజత్ పటిదార్‌లు కూడా టచ్‌లోకి వచ్చారు. మ్యాక్స్‌వెల్, గ్రీన్‌లు రాణించాల్సిన అవసరముంది. ఇక ఫినిషర్‌గా పలు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన దినేశ్ కార్తిక్ మరోసారి మెరవాల్సి ఉంది. ఆరంభంలో పేలవంగా కనిపించిన బౌలింగ్ గాడిన పడింది. సిరాజ్, యష్, ఫెర్గూసన్ ఆకట్టుకుంటున్నారు.
ఆ ఇద్దరే..
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం పూర్తిగా ఇద్దరి మీదే ఆధారపడి ఉంది. కెప్టెన్ సంజూ శాంసన్ ( 504 పరుగులు), రియాన్ పరాగ్ (531 పరుగులు) రాణించడంపైనే రాయల్స్ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్ జైస్వాల్ (348 పరుగులు) తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ధ్రువ్ జురేల్ అంతగా ఆకట్టుకోలేక పోవడం యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. ఇక బౌల్ట్, సందీఫ్ శర్మ, అవేశ్‌తో పేస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. అశ్విన్, చాహల్‌లు తమ స్పిన్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు.






