కొల్లూరు డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల సమస్యలను పరిష్కరిస్తా..
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు..
లబ్ధిదారులతో సమావేశం..
సమస్యలను ఏకరువు పెట్టిన లబ్ధిదారులు..
పటాన్‌చెరు: తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల సమస్యలను పరిష్కరిస్తానని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. శుక్రవారం కొల్లూరు కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సమస్య, పైపుల లీకేజీలు, కరెంటు, పారిశుద్య సమస్యలను కలెక్టర్‌కు తెలిపారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆసుపత్రిలు, అంబులెన్స్, ఆర్‌టీసీ బస్సు సౌకర్యాలు కావాలని అడిగారు.
దొంగతనాలు జరుగుతున్నాయని, పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలన్నారు. సెల్ సిగ్నల్స్ సమస్య ఉందని, కరెంటు, పారిశుద్య కార్మికుల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ అక్కడే సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారంపై సూచనలు చేశారు. ఆర్‌డీవో రవీందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




