కృష్ణం వందే జగద్గురుమ్
26న శ్రీకృష్ణాష్టమి :
త్రేతాయుగంలో భగవంతుడు శ్రీ రాముని రూపంలో మానవుడి గా అవతరించి ధర్మమార్గంతో ఆదర్శమైతే, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ‘గీతోపదేశం’తో ఉ దాత్త జీవన గమ్యాన్ని చూపాడు. అర్జునునికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశం నేటి సమాజానికీ చక్కగా, గొప్పగా ఉపయోగపడుతుంది. మానవాళికి అత్యంత ఉత్కృష్టమైన, ఆదర్శవంతమైన, శాంతియుతమైన ఆనందదా యకమైన బాటను గీత చూపిస్తుంది. ఇది ఒక రకంగా మానవుల ప్రవర్తనా నియమావళి. కృష్ణ భగవానుడి గీతోపదేశం మనుషు లను క్రమంలో పెట్టి కర్తవ్యాన్ని బోధిస్తుంది.
కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు నిర్వీర్యు డై గురువులను, బంధువులను చంపనని బంధువ్యామోహంలో పడిపోతాడు. తన రథసారధి అయిన శ్రీకృష్ణుని శరణుజొస్తాడు. ఆ సమయంలోనే భగవద్గీత ఆవిర్భవి స్తుంది. మానవ జీవిత విధానాన్ని చక్కని మార్గంలో పెట్టడానికి ముఖ్యంగా మన మనసుకు శిక్షణ ఇచ్చి అదుపులో పెట్టడానికి కావ లసిన ఉపాయాలెన్నో గీతద్వారా కృష్ణుడు బోధించాడు. ఆ ప్రణాళికల ఆధారంగానే కురుక్షేత్రంలో తన వారితో యుద్ధం చేయడానికి విముఖడైన అర్జునుడు కర్తవ్యదీక్షకు ఉద్యమిస్తాడు.
‘భగవద్గీత’నే ‘గీతాజ్ఞానం’ అనీ అంటాం. ఈ జ్ఞానబోధ దాదాపు 5,000 సంవత్సరా ల క్రితం నాటిది. కృష్ణుని ఆనాటి సందేశం ఈనాటికీ మానవ జీవితాలను నడిపిస్తున్న ది. బోధ చేసింది నిజానికి అర్జునునికే అయి నా అది సమస్త మానవాళికి వర్తిస్తున్న మ హా సందేశం. గీతాసారాన్ని ఏ కొద్దిగానైనా అవగాహన పరచుకోగలిగితే జీవితంలో నిరాశ అన్నదే ఉండదు. ఆత్మకు అంతం లేదు. శరీరం అశాశ్వతమైంది. ఒక వస్త్రం లాంటిది. చిరిగిన వస్త్రాన్ని వదిలేసి ఆత్మ మ రొక శరీరాన్ని ఆకృతిగా చేసుకుంటుంది. ఈ జీవన సత్యాన్ని ప్రతీ మనిషీ గ్రహించి, ఆచరణలో పెట్టగలగాలి. అందుకే, ఈ ‘కృష్ణోపదేశమే’ మానవుడికి సదా‘బ్రహ్మోపదేశమ’ని వేదజ్ఞానులు సెలవిచ్చారు.
కష్టాల్ని తెలివిగా అధిగమించాలి
శ్రీకృష్ణుడు జన్మించక ముందే మృత్యు వు ఆయనకై వేచి ఉంది. రాజు కావాల్సిన కృష్ణుడు కారాగారంలో జన్మించాడు. తల్లిదండ్రులకు దూరమై గోవులమధ్య గోకులం లో పెరిగాడు. ఆ కారణంగా 16 ఏండ్ల వయ స్సు వచ్చేవరకు అతనికి చదువు దొరకలేదు. జరాసంధుడి బాధనుండి తన వాళ్లను రక్షించుకోవడానికై సముద్రం మధ్యలో ద్వారక ను నిర్మించుకున్నాడు. అప్పుడు అతణ్ణి పిరికివాడని, పారిపోయాడని అందరూ అవమానించారు. అయినా, తన వారికోసం నిం దలను భరించాడు. ఈ రకంగా కష్టాలు, అవమానాలు ఎదురైనప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని శ్రీకృష్ణు డు మానవాళికి నేర్పాడు.
శ్రీకృష్ణునికి స్నేహితుడు అంటే ఎంతో ప్రేమ. కృష్ణుని జీవితాన్ని మనం గమనిస్తే స్నేహితుని కుటుంబసభ్యుడిగా ప్రేమించా డు. అడగకుండానే స్నేహితుని కష్టాలు తెలుసుకొని వాటిని తీర్చాడు. కృష్ణుడు తన జీవి తాంతం ఎన్నో కష్టాలు అనుభవించాడు. కా నీ, ఏనాడూ అందులోని బాధను బహిర్గతం చేయలేదు. సదా, చిరునవ్వులనే చిందిస్తూ వచ్చాడు. కృష్ణుడు జన్మించక ముందే అతని సోదరులు దారుణంగా హత్యకు గురయ్యారు. తల్లిదండ్రులు చెరసాలలో మగ్గిపో యారు. కృష్ణుడు ఖైదీగానే పుట్టాడు. పుట్టిన మరు నిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అయినా, ఆశ్చర్యంగా చిరునవ్వునే ఆయుధంగా ధరించాడు. సమస్యలను, స వాళ్లను, కష్టాలను, కన్నీళ్లను ఎలా ఎదుర్కోవాలో మానవాళికి ఆచరణాత్మకంగా బోధించాడు.
మన కర్మలకు మనమే బాధ్యులం
మేనమామ కంసుణ్ణి వధించి చెరసాలలో ఉన్న తల్లిదండ్రులను విడిపించాడు. తల్లిదండ్రుల కోసం మనం దేన్నైనా వదులుకోవాలని, ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనకాడకూడదని దీనిద్వారా తెలుసుకోవాలి. కేవలం మనుషులమేకాక పశువులను కూడా సమానంగా ప్రేమించాలి. ఆలనా పాలనా చూస్తూ వాటిని ఆనందింప చేయాలని గోపాలుడుగా ఆలమందలో మురళి వాయిస్తూ చెప్పకనే చెప్తాడు. రాధాకృష్ణుల ప్రేమ పవిత్రమైంది, ఆదర్శమైంది, నిస్వార్థమైందని ప్రేమ తత్వాన్ని బోధించాడు. వర్గబేధం, లింగబేధం లేకుండా తన భక్తులందరినీ కరుణిస్తాడు. మానవజాతికి సమాన త్వాన్ని ప్రబోధించాడు. నిరాశ నిస్పృహలతో తికమక పడేవారికి ఆత్మ నిబ్బరం, ఉత్సాహం, సాహసం, ధైర్యం కలిగించాలన్నదే ‘గీత’లోని ప్రధాన లక్ష్యం.మానవుడు తనను తాను కించపరచుకోకుండా ఉద్ధరించుకొనే మార్గం అలవరుచుకోవాలి.
మనం పొందే ఉన్నత స్థితులకు మనమే బాధ్యులం. ఎవరిని వారు తీర్చిదిద్దుకున్నప్పుడు విజయం సాధించవచ్చు. ఏకాగ్రత, శక్తి సామర్థ్యాలకు ఎన్నడూ తిరుగుండదని బోధించాడు. అయితే, కృష్ణుడు చేసిన పనులన్నీ మానవుడు చేయలేడు. ఆయన అందించిన జీవన సందేశాన్ని మాత్రం భూమిపై వున్న ప్రతీ మానవుడు దివ్యంగా, దిగ్విజయంగా ఆచరించుకోవచ్చు.
- వేముగంటి శుక్తిమతి






