21 May, 2026 | 2:34 PM

‘గెస్టు లెక్చరర్ల’ గోస

23-08-2024 01:09 AM
  1. విధుల్లో తీసుకోని విద్యాశాఖ 
  2. జూలై 31తో ముగిసిన రెన్యూవల్ 
  3. రెన్యూవల్‌పై ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి):  ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే అతిథి అధ్యాపకుల జీవితాలు త్రిశంకు స్వర్గంలా మారాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావస్తున్నా విద్యాశాఖ ఇప్పటి వరకూ వీరిని విధుల్లోకి తీసుకోలేదు. వీరి రెన్యూవల్ ముగిసి ఇరువై రోజులవుతున్నా ఇంకా రెన్యూవల్ చేయలేదు. దీంతో గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి అయోమయంలో పడింది.

గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయకుండా ఇంటర్ బోర్డు నాన్చుతోందనే విమర్శలు వినిపిస్తున్నా యి. ఈ విద్యాసంవత్సరంలో జూలై 31తో రెన్యూవల్ అయిపోవడంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. రాష్ర్టంలో  దాదాపు 1654 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నా రు. వీరి ఉద్యోగాలను రెన్యూవల్ చేయడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతంత మాత్రం వేతనాలతో ఇబ్బందులు పడుతున్న వీరికి వేతనాలు  పెండింగ్‌లోనే ఉన్నాయి. 

ఒక పీరియడ్‌కు రూ.390

ప్రభుత్వ కాలేజీల్లో రెగ్యూలర్ నియామకాలు  కొంత కాలంగా చేపట్టడంలేదు. దీంతో అతిథి అధ్యాపకులను తీసుకుంటున్నారు. 2012 విద్యాసంవత్సరం నుంచి వీరు పనిచేస్తున్నారు. 422 కాలేజీల్లో మొత్తం 1654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. రెండు నుంచి మూడు పీరి యడ్లు చొప్పున నెలకు 72 పీరియడ్లు చెప్పాలి. ఒక పీరియడ్‌కు రూ.390 చొప్పున చెల్లిస్తారు. ఇలా నెలకు వీరికి వేతనం రూ.28,080 ఇస్తారు. నెలకు 72 పీరియడ్లు మాత్రమే చెప్పాలనే నిబంధన ఉన్నా అధ్యాపకులు మాత్రం రోజుకు నాలుగైదు పీరియడ్లు చెప్తున్నారు. విద్యార్థుల భవిష్యత్, సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని అదనపు పీరియడ్లనూ బోధిస్తున్నారు.

దాదాపు పన్నేండేళ్లుగా ఈ వృత్తినే వీరు నమ్ముకొని ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి  కృషి చేస్తున్నారు. మొదట్లో వీరికి10 నెలల వేతనం చెల్లించేవారు. ఆ తర్వాత ఆరు నెలల నుంచి మూడు..నాలుగు నెలలకుకు తగ్గించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో నాలుగు నుంచి ఆరు నెలల వేతనం పొంది కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ప్రతి విద్యాసంవత్సరం ప్రారంభం నుండే  గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తమకు అందరిలాగా 12 నెలల వేతనాన్ని చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లకు ఫిక్స్‌డ్ వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 1365 వరకు జూనియర్ లెక్చరర్ల ప్రక్రియను టీజీపీఎస్‌సి భర్తీ ప్రక్రియను చేపడు తోంది. గెస్ట్ లెక్చరర్లకు మూడున్నర నెల వేతనం పెండింగ్‌లో ఉందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గానూ రెండున్నర నెలల వేతనం ఇప్పటికే మంజూరు చేశారు. 

వెంటనే రెన్యూవల్ చేయాలి..

జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో పనిచేయడానికి వెంటనే గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలి. వీరిని విధుల్లో తీసుకోకపోవడంతో పేద వర్గాల పిల్లలు చదివే జూనియర్ కాలేజీల్లో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా రెన్యూవల్ చేయలేదు. 

 కొప్పి శెట్టి సురేష్, 

తెలంగాణ గెజిటెడ్ జూనియర్ 

లెక్చరర్ల సంఘం కార్యదర్శి


దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం..

గత పన్నెండేళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నాం. ఈ ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నాం. పెండింగ్ వేతనాలను విడుదల చేసి, విధుల్లోకి తీసుకోవాలి. 

 నాగేశ్వరరావు, మ్యాథ్స్ గెస్ట్ లెక్చరర్