సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ముకరంపుర, ఆగస్టు 21(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోనీ రేకుర్తి , విద్యానగర్, ఇతర ప్రాంతాలతో పాటు జిల్లాలో పేద ప్రజలకు చెందిన ఇళ్లను, స్థలాలను అన్యాయంగా 22/A నిషేధిత జాబితాలో చేర్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మేయర్ కొలగాని శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మరియు నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా డిఆర్‌ఓ జె.స్వామిని కలసి తమ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఎలాంటి సమాచారం లేకుండా నగరంలో రేకుర్తి , విద్యానగర్, ఇతర ప్రాంతాలతో పాటు జిల్లాలో పేద ప్రజల నివాసాలను, స్థలాలను అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిషేధిత జాబితా నుంచి పేద ప్రజల ఇండ్లను తొలగించి, బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు త్వరితగతిన పరిష్కారం కాకపోతే, బిజెపి పక్షాన పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.






