02-11-2025 01:51:03 PM
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సంఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు.
60 లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. త్వరలోనే మణుగూరును సందర్శిస్తానని, కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని, అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోను ఉన్నాయని కేటీఆర్ విరుచుకుపడ్డారు.