పవన్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్.. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.!
- జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది?
- పవన్ ను ఎవరూ అడ్డుకోలేదు.. ప్రజలే అడ్డుకున్నారు
- తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరే
- పవన్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు
హైదరాబాద్: జనసేన కొత్త పోటీ చేసేదేముంది? 2023లో జనసేన పోటీ చేసింది.. మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేసిందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) తెలిపారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను ఎవరూ అడ్డుకోలేదు.. ప్రజలే అడ్డుకున్నారని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని పవన్ కళ్యాణ్ గతంలో అన్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడితే అన్నం తినని వ్యక్తి.. రాష్ట్ర అవతరణ రోజు సభ ఎందుకు పెట్టారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగీరే.. అందులో అనుమానం లేదని పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని పవన్ అన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు.. దాన్ని తప్పు పడతారా? తెలంగాణకు వస్తున్న పరిశ్రమలను మోదీ.. గుజరాత్ కు తరలించారు... దాన్ని ఏమనాలి?. జాతీయవాదం గురించి పవన్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. ఒక నటుడిగా.. ఏపీకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తామని కేటీఆర్ వెల్లడించారు. మా రాష్ట్రం కోసం పోరాడటానికి తమకు ఓజీలు, నేతలు ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ చెప్తున్నది కాకి లెక్కలు
బీఆర్ఎస్ చేసిన అప్పులు తీరుస్తున్నామని కాంగ్రెస్ చెప్తున్నది కాకి లెక్కలని కేటీఆర్ ఆరోపించారు. ఏడాది కాలంలో రూ. 29 వేల కోట్లు మాత్రమే అప్పులు తీర్చారని లెక్కచెప్పారు. నెలకు రూ. 6 వేల కోట్లు అప్పు తీరుస్తున్నామనేది అబద్ధం.. రూ. 2 వేల కోట్లే చెల్లిస్తున్నారని వివరించారు. తెలంగాణను డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు 2014లోనే జరిగాయని వివరించారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రలకు ప్రయత్నించారని చెప్పారు. మన అనుమతి లేకుండానే మన గ్రామాలు లాక్కున్నారు. మన సీలేరు ప్రాజెక్టును మన అనుమతి లేకుండానే తీసుకున్నారని ధ్వజమెత్తారు.






