22 June, 2026 | 4:21 AM

అధికారులకు బదిలీల ఫీవర్!

15-06-2024 01:07 AM
  • వరంగల్ సీపీ మార్పు తప్పదా?

సెలవులో ఢిల్లీకి వెళ్లిన సీపీ అంబర్ కిశోర్ ఝా

కొత్త సీపీ రంగనాథ్ అంటూ ప్రచారం

హనుమకొండ కలెక్టర్ సైతం బదిలీ?

గత ప్రభుత్వం విధానాలే అమలు చేస్తున్న కాంగ్రెస్

హనుమకొండ, జూన్ 14 (విజయక్రాంతి): ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో అధికారులకు బదిలీ ఫీవర్ పట్టుకుంది. ఎప్పుడు బదిలీ ఆర్డర్ వస్తుందోనని కొంతమంది అధికారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ శాఖలో అత్యధికంగా అధికారుల బదిలీ జరగనున్న నేపథ్యంలో కొందరు వారు కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్‌తో పాటు హనుమకొండ జిల్లా కలెక్టర్ కూడా బదిలీ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వరంగల్ సీపీగా ఉన్న అంబర్ కిషోర్ ఝా పదిరోజుల ప్రత్యేక శిక్షణ నిమిత్తం శుక్రవారం ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆ పోస్ట్ దక్కించుకునేందుకు నార్త్‌జోన్ ఐజీగా ఉన్న ఏవీ రంగనాథ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. దాదాపుగా ఆయనకే వరంగల్ సీపీగా పోస్టింగ్ ఖరారైందని పోలీస్‌వర్గాలో చర్చ నడుస్తోంది. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సైతం బదిలీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

గత ప్రభుత్వ తరహాలోనే!

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు లేఖల ఆధారంగా అధికారులకు పోస్టింగ్‌లు కట్టబెట్టారు. ఇదే అదునుగా భావించిన మెజార్టీ ప్రజాప్రతినిధులు పోస్టింగ్‌ల కోసం బేరసారాలు నడిపారు. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ శాఖలో పోస్టింగ్‌ల కోసం అధికారులు లక్షలు ముట్టజెప్పిన ఘటనలున్నాయి. స్థానికంగా ఉన్న పరిస్థితులకనుగుణంగా ఎస్సై, సీఐ, తహసీల్దార్ పోస్ట్ కోసం రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇక డీఎస్పీ, డీసీపీ, సీపీ, ఆర్‌డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ పోస్టులకు ఉన్న డిమాండ్ బట్టి కొన్ని జిల్లాల్లో భారీ మొత్తంలో ముడుపుల బేరం నడిచినట్లు విమర్శలు వినవచ్చాయి. ప్రజా ప్రతినిధుల సిఫార్సుల లేఖల ఆధారంగా పోస్టింగ్‌లు పొందిన అధికారులు బీఆర్‌ఎస్  నాయకులు చెప్పిన పనుల కల్లా  తలాడించి చిక్కుల్లో ఇరుక్కున ఘటనలు చూసాం. కొంతమంది అధికారులు ఏకంగా వివిధ స్కాంల్లో ఇరుక్కుని జైలుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే ఈ ప్రభుత్వం సైతం అమలు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

వరంగల్ సీపీ ఎవరు?

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా చెప్పుకునే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పని చేసేందుకు అధికారులు ఉత్సాహం ప్రదర్శిస్తారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూశాఖలు పెద్దమొత్తంలో ఆదాయాన్ని సమకూర్చే విభాగాలు కావడంతో ఇక్కడి పోస్టింగ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు జిల్లాలు ( వరంగల్, హనుమకొండ, జనగామ ) ఉండటం అతి పెద్ద ఆదాయ వనరుగా ఉండటంతో సీపీ పోస్ట్ కోసం పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత సీపీ అంబర్ కిశోర్ ఝా ఎన్నికల కోడ్‌లో భాగంగా బదిలీపై ఇక్కడికి వచ్చారు.

కాగా ఆయన బదిలీ ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి పదిరోజుల పాటు సెలవుపై ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన బదిలీ అవుతున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్ల యింది. ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ సీపీగా పనిచేసి ప్రస్తుతం నార్త్‌జోన్ ఐజీగా ఉన్న ఏవీ రంగనాథ్ మరోసారి పోస్టింగ్ దక్కించుకునేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా పైరవీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ఇక్కడికి రావడం ఇష్టం లేని హనుమకొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరో ఐపీఎస్ అధికారికి ఆ పోస్టింగ్ ఇప్పించేందుకు ప్రభుత్వ సలహాదారుడి ద్వారా ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వరంగల్ సీపీ పోస్ట్ ఎవరిని వరించనుందోననే చర్చ కమిషనరేట్‌లో జోరుగా నడుస్తోంది.