కేటీఆర్‌కు ఇంకా నిద్ర పట్టడంలేదు
- అధికారం కోల్పోయిన బాధ నుంచి తేరుకోలేదు
- ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాం తి): కేటీఆర్ నిలువెత్తునా విషం నింపుకుని మాట్లాడుతున్నారని, ఆయన మతిస్థిమితం కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఎప్పటికీ తా మే అధికారంలో ఉంటామని కేసీఆర్, కేటీఆర్ భ్రమపడ్డారని ఎంపీ చామల విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రం గారెడ్డితో కలిసి నిర్వహించిన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మైండ్ బ్లాక్ అయి కాంగ్రెస్ 50 ఏళ్లవరకు అధికారంలోకి రాదంటున్నారని, అధికారం కోల్పోయామని కేటీఆర్ ఇప్పటికీ నిద్ర పట్టడం లేదని ఎద్దేవాచేశారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని గెలవగానే కేటీఆర్ తొడలు కొడుతు న్నారని, బీఆర్‌ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. పదేళ్లు ఫామ్ హౌస్ పరిపాలన చేశారని, ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవలేదు.. నిజాం నవాబుల్లా పాలించారు.. దోచుకుందాం, దాచుకుందాం, ఓట్లు కొనుక్కుందాం అని కేసీఆర్ కుటుంబం అనుకున్నదని ఎంపీ చామల ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చదువుకున్నాడా? లేక అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడా..? అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఆయన తెలిపారు.
రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కాంగ్రెస్ హయాంలో కట్టారని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెట్రో రైలు కాంగ్రెస్ హయాంలో వచ్చిందని విషయం తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలు అన్ని కాంగ్రెస్ హయాంలో వచ్చాయని, కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ కడితే చెక్కు చెదరలేదని, కేసీఆర్ విశ్వేశ్వరయ్య అనుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కూలిందని ఎంపీ చామల ఎద్దేవా చేశారు.
మూసీ రివర్ బోర్డుకు కేటీఆర్ ఎప్పుడూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీపీఆర్ రెడీ చేసి మూసీ పనులు మొదలుపెట్టామన్నారు. జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి మెట్రో రైల్ తెచ్చారని, దేశంలో 7 బులెట్ రైళ్లు ఉంటే మూడు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి.. ఢిల్లీ ఎందుకు వెళ్తున్నామో అర్థం అవుతుందా కేటీఆర్ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మోడీని రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు అయినా కలుస్తారు.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మోడీని బడే భాయ్ అన్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ కు ఎవ్రెల్లిలో, కేటీఆర్‌కు జన్వాడలో, హరీష్ రావుకు మొయి నాబాద్, కవితకు శంకర్ పల్లిలో ఫామ్ హౌస్ ఉందని, కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
కేటీఆర్ బీఆర్‌ఎస్ నుంచి కవిత పార్టీలోకి ఎంతమంది వెళ్తారో లెక్క చూసుకోవాలని హితవు పలికారు. ఇబ్రహీంపట్నం లో మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఎన్ని ఎకరాలు కబ్జాలు పెట్టారో ప్రజలకు తెలుసని, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడ భూములు కొన్నారో కేటీఆర్ చెప్పాలని, మంచిరెడ్డి కిషన్ రెడ్డి మందిని ముంచే కిషన్ రెడ్డి అని ఎంపీ చామల మండిపడ్డారు.




