23 April, 2026 | 3:36 PM

ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్

19-12-2024 02:25 AM

రోజుకో వేషధారణలో శాసనసభకు.. 

ఆటో కార్మికులకు అండగా నిలవాలని డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశా ల్లో రోజుకో సన్నివేశానికి అసెంబ్లీ వేదికవుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేష ధారణలో శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. మంగళవారం నల్ల చొక్కాలు ధరించి రాగా బుధవారం ఆటో డ్రైవర్ల వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదటి రోజు అదా నీ, రేవంత్‌రెడ్డి టీషర్ట్స్‌తో, రెండో రోజు నల్లా చొక్కాలు ధరించి, లగచర్ల రైతులకు మద్దతుగా బేడీలతో వచ్చారు.

అయితే బుధవారం ఆటో డ్రైవర్ల వేషధారణలో వచ్చి వారి సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోల్లోనే రావడం విశేషం. మాజీ మంత్రి కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేలను ఎక్కించుకుని స్వయంగా తానే ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా నిలవాలని.. 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని కేటీఆర్ ఆరోపించారు.