23 April, 2026 | 4:49 PM

మాదన్నపేటలో అగ్నిప్రమాదం

19-12-2024 09:45 AM

హైదరాబాద్: మాదన్నపేటలోని ఓ ఫర్నీచర్ వర్క్‌షాప్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత ఈద్గా మాదన్నపేట ఎదురుగా ఉన్న సూపర్‌ ఫర్నీచర్‌ వర్క్స్‌లో మంటలు చెలరేగి మూడు షాపుల్లో ఉన్న వర్క్‌షాప్‌లో వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌, మొగల్‌పురా నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. డీఆర్‌ఎఫ్‌ బృందాలు, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సహకరించారు. షట్టర్‌లకు తాళం వేయడంతో డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాకి కడ్డీలతో దాన్ని పగలగొట్టి, తర్వాత కట్టర్‌లను ఉపయోగించారు. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. పెద్ద శబ్ధం వినిపించిందని, ఆ తర్వాత ఆవరణలో మంటలు ఎగిసిపడడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.