23 April, 2026 | 2:21 PM

Breaking News

పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

19-12-2024 02:20 AM
  • పది నెలల్లో బాగు చేయమంటే ఎలా?
  • ఆటో డ్రైవర్లను మోసం చేసిందే మీరు..
  • సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
  • బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి, పది నెలల్లో మమ్మల్ని బాగు చేయమంటే ఎలా సాధ్యమని బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ నిర్వహణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తమపై ఆరోపణలు చేసేముందు, వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు.

కొత్త సభ్యులకు, సీనియర్ సభ్యులకు తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభ నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2014లో సభ నిబంధనలను రూపొందించిన వారే ఇప్పుడు వాటిని పాటించడం లేదని ఎద్దేవా చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక వేషం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో వేషం వేస్తున్నా రని విమర్శించారు.

‘ఆటో డ్రైవర్ల డ్రెస్‌లు వేసుకొచ్చిన వారు గతంలో వారి కోసం ఏం చేశారు? వారిని మోసం చేసిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం’ అని అన్నారు. ఆరు గ్యారెంటీలను తాము కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. పదేళ్లు ఏ ప్రాజెక్టుపై ఎంత కమీషన్ తిన్నారో చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సభ దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని కొనసాగిస్తున్నామని చెప్పినా.. ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

సభాపతిపై గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని మద్దతు ఇస్తున్నారా? కొత్త సభ్యులకు ఏం నేర్పిస్తున్నారు? అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. భూ భారతి బిల్లును అడ్డుకోవడంపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షంలోని తమకు కనీసం సవరణలకు కూడా అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. తాము మాత్రం సామాన్యులకు మంచి జరిగేందుకు ఇచ్చే సలహాలు, సూచనలను తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. బిల్లుపై చర్చకు ప్రతిపక్షాలకు సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.