23 April, 2026 | 4:34 PM

ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి

23-04-2026 03:25 PM
  1. అధికారులకు ఆదేశాలు
  2. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
  3. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి
  4. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రం పరిశీలన

తంగళ్లపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్‌తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్‌లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపునిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.