10 March, 2026 | 5:42 PM

ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లపై శ్రమ దోపిడీ

09-03-2026 03:36 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను యాజమాన్యం శ్రమదోపిడికి గురిచేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ఆరోపించారు.సోమవారం ఆసిఫాబాద్‌లోని ఎస్‌టీయూ భవన్‌లో పీహెచ్‌బీ డ్రైవర్ల యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ డిపో సమావేశం డిపో అధ్యక్షుడు మధుసూదన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లు తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి, లాభాల సాధనకు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

అయితే వీరికి కార్మిక చట్టాలు అమలు చేయకపోవడంతో శ్రమదోపిడీ జరుగుతోందని అన్నారు. ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, అలాగే ఈఎస్ఐ, ఈపీఎఫ్, బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేసి కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు.

ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, పని ఒత్తిడిని తగ్గించి ఆర్టీసీ అధికారుల వేధింపులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీహెచ్‌బీ డ్రైవర్స్ యూనియన్ డిపో అధ్యక్షుడు మధుసూదన్, ఎండీ సజిత్ హుస్సేన్, అశోక్, సాయికిరణ్, రమేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.