ఐదేళ్లలో 2 లక్షలు
జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు.
ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శాసన మండలిలో సోమవారం బీఆర్‌ఎస్ సభ్యులు తాతా మధు, వాణిదేవి, కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానం చెప్తూ.. దశలవారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
ఇప్పటివరకు 54 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 11 వేల పోస్టులకు నోటిఫికేషన్ వేశామని, త్వరలో వాటికి పరీక్షలు నిర్వహించి భర్తీచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఈ స్థాయిలో ఉద్యోగాల ప్రక్రియ చేపట్టలేదని, ఆపార్టీ సభ్యులు ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని విరుచుకు పడ్డారు. అదేవిధంగా పర్యాటక రంగంలోనూ రాష్ట్రం అభివృద్ధి చెందేవిధంగా తగిన నిధులు కేటాయిస్తామని, ఇప్పటికే పక్క రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలను చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులు లగచర్ల రైతులను జైలు నుంచి విడుదల చేయాలని పోడియం వద్ద నినాదాలు చేశారు. కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను మంగళవారానికి వాయిదా వేశారు.






