రేషన్‌కు స్మార్ట్ కార్డులు
సంక్రాంతి తరువాత కొత్త కార్డుల పంపిణీ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ప్రస్తుతం ఉన్న రేష న్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీచేస్తామని, సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా ౧౦ లక్షల కొత్త రేషన్ కార్డుల మం జూరుకు అవకాశం ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు.
తద్వారా రాష్ట్రంలో 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని సభకు వివరించారు. సోమవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండ రాం, మీర్జా రియాజుల్ హసన్ ఏఫెండిలతోపాటు జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదిత రులు అడిగిన ప్రశ్నలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం ఇచ్చారు.
ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా కొత్తరేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేస్తా మని వెల్లడించారు. కొత్త కార్డుల మంజూరుతో ప్రభుత్వంపై అదనంగా రూ. 956 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు మీసేవా కేంద్రం ద్వారా గడిచిన పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు వివరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రివర్గ ఉపసంఘం నియమించారని గుర్తుచేశారు. తాను చైర్మన్‌గా, మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్న ఉపసంఘం పలుమార్లు సమావేశమై సిఫారసులను క్యాబినెట్ ఆమోదం కోసం పంపించినట్టు స్పష్టంచేశారు.
కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీంకోర్టుకు సక్షేనా కమిటీ సమర్పించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సూచనలను ఉపసంఘం పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు.
త్వరలో రేషన్ డీలర్ల భర్తీ
రాష్ర్టంలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను చేపడతామని, కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలతోపాటు తండాల్లోనూ కొత్త చౌకధరల దుకాణాలను ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలు వినియోగించడంలేదని, అందుకే సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు.
చౌక ధరల దుకాణాల ద్వారా ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన ఇప్పటివరకు లేదని, ఉంటే క్యాబినెట్ ముందు పెట్టి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో 91,68,231 రేషన్ కార్డులు ఉన్నాయని.. వీటి ద్వారా 3.38 కోట్ల మంది లబ్ధిపొందినట్టు వివరించారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏపీకి చెందిన వారు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లడంతో 2,46,324 రేషన్ కార్డులు రద్దయినట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక 2.7 కోట్ల లబ్ధిదారులకు మొత్తం 89,21,907 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టం సిరీస్‌కు కొత్త ఆహారభద్రత కార్డులు అనుసంధానం చేశామని పేర్కొన్నారు.
2016 నుంచి 2023 వరకు కొత్తగా 20.69 లక్షల మంది లబ్ధిదారులకు 6,47,479 ఆహార భద్రతాకార్డులు మంజూరు చేశారని చెప్పారు. 2016 నుంచి 2023 వరకు 19 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి 5,98,000 ఆహార భద్రతాకార్డులు తొలగించారని స్పష్టంచేశారు. అంటే గత పదేళ్లలో 86 వేల మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 49 వేలు మాత్రమేనని విమర్శించారు.






