18 April, 2026 | 5:38 PM

కొత్త ఆర్వోఆర్ చట్టానికి ఓకే

17-12-2024 01:49 AM
  1. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలని క్యాబినెట్ నిర్ణయం
  2. భూమిలేని కూలీలకు ఏడాదికి 12 వేల సాయం
  3. మొదటి విడతలో రూ.6 వేలు పంపిణీ  
  4. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నా స్థానిక పోటీకి అర్హులే 
  5. స్కిల్, మహిళా వర్సిటీ, జీఎస్టీ సవరణ బిల్లులకూ ఆమోదం   
  6. విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టులపై నివేదికలు వచ్చాకే చర్చ 

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి ): రాష్ట మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో పలు బిల్లులపై చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ఈ-కార్ రేసు, ఆర్వోఆర్ కొత్త చట్టం, సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ,  వ్యవసాయ కూలీలకు ఇచ్చే సాయం, యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, మహిళా వర్సిటీ, జీఎస్టీ సవరణ బిల్లుతో పాటు పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్న వారికి కూడా పోటీ చేసే అవకాశానికి సంబంధించిన అంశాలను చర్చించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలకు రూ.6 వేల చొప్పున రెండు విడతలుగా మొత్తం రూ.12 వేలు సాయం చేయాలని, ఆ  డబ్బులు ఎప్పుడు ఇచ్చేది అసెంబ్లీ వేదికగానే ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు.

కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని సర్కార్ నిర్ణయించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. దాని వల్ల ఇబ్బంది పడిన భూయజమానులకు కొత్త చట్టంతో న్యాయం జరుగుతుందని చర్చించారు. 

ఈ-కార్ రేసే ప్రధానాంశం

గత ప్రభుత్వం నిర్వహించిన ఈ-కార్ రేసు అంశంమే క్యాబినెట్ భేటీలో ప్రధాన అంశంగా మారింది. ఈ-కార్ రేసుకు సంబంధించిన అవకతవకలు, అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు వివరించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ రేసు గురించి మంత్రివర్గంలో చర్చించకుండానే అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిధులు మళ్లించారని రేవంత్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ-కార్ రేసు అవినీతిపై విచారణ జరిపించాలని నిర్ణయించింది. కేటీఆర్‌పై ఏసీబీ ద్వారా విచారణ జరిపించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు గవర్నర్ ఓకే చెప్పడంతో మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.

కేటీఆర్‌పై విచారణకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు అందోళనకు దిగే అవకాశం ఉందని, దాన్ని ప్రభుత్వం, పార్టీ పరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్టు సమాచారం. అంతే కాకుండా విద్యుత్ కొనుగోళ్లతో పాటు సాగునీటి ప్రాజెక్టుల్లో వేసిన కమిషన్లు ఇచ్చే నివేదికలపై మరో క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.