3 July, 2026 | 7:58 PM

పొన్నంకు రోజూ 50 లక్షలు

12-06-2024 12:29 AM

ఫ్లుయాష్ ఓవర్‌లోడ్ దందాలో ముడుపులు

వసూలు చేస్తున్నది ఆయన సోదరుడి కుమారుడే

ఈ అంశంపై పొన్నంతో ఎక్కడైనా చర్చకు సిద్ధం

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ 

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రామగుండం ఎన్టీపీసీ నుంచి ప్లుయాష్ (బూడిద) రవాణా విషయంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెట్టింపు పరిమాణంతో ఫ్లుయాష్ తరలిస్తూ ఓవర్ లోడ్‌తో లారీలు వెళ్లుతున్నాయని, ఈ వ్యవహారంలో మంత్రికి రోజూ రూ.50 లక్షలు ముడుతున్నాయని ఆరోపించారు.

పొన్నం ప్రభాకర్ సోదరుని కుమారుడు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలను పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని మంత్రి ఫోన్ చేయడంతో వదిలిపెట్టారని మండిపడ్డారు. ఒక లారీలో 32 టన్నులు తరలించాల్సి ఉంటే 74 టన్నులు తరలిస్తున్నారని, వే బిల్లుల్లో ఎన్ని టన్నుల లోడ్ తీసుకెళ్తున్నారో పేర్కొనడం లేదని అన్నారు. మంత్రి పొన్నం ఒత్తిళ్లకు రవాణా శాఖ అధికారులు లొంగుతున్నారని, అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

ఫ్లుయాష్ లారీలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవలే ఇంజినీరింగ్ విద్యార్థి అఖిల్‌ను లారీ బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని మరణంతో లారీల రవాణా గురించి తెలుసుకోవాల్సి వచ్చిందని, యువకుని మరణం మంత్రి పొన్నంకు శాపంలా తగలడం ఖాయమని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఎస్టీపీసీ అధికారులు చోద్యం చూస్తున్నారని, త్వరలో ఢిల్లీకి వెళ్లికి ఉన్నతాధికారులకు దీనిపై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. ఓవర్‌లోడ్ దందా ఆపకపోతే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం రామగుండం ఎన్టీపీసీని సందర్శిస్తుందని హెచ్చరించారు.

తాను ఆధారాలతో ఆరోపణలు చేస్తూంటే పొన్నం నా దిష్టిబొమ్మలు దహనం చేయిస్తున్నారని మండిపడ్డారు. పేదల శవాలపై మంత్రి పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు వితండవాదం చేస్తున్నారని, ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15లోగా గ్యారెంటీలను అమలు చేసి రైతు రుణమాణీ చేస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు.