02-11-2025 12:50:03 AM
రవితేజ హీరోగా నటించిన చి త్రం ‘మాస్ జాతర’ ఇప్పుడు థియేటర్లలో ఉంది. శుక్రవారం సాయంత్రం ప్రీమి యర్స్ షోలతోనే సందడి మొదలైంది. ప్రమోషనల్ కంటెంట్, పాటలు ఆదరణ పొందటం.. ‘ధమాకా’ తర్వాత రవితేజ, శ్రీలీల మరోసారి జత కట్టిన సినిమా కావటంతో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
ఇప్పటిదాకా రచయితగానే కొనసాగిన భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమైన చిత్రమూ ఇదే కావటంతో అందరిలో ఆసక్తిని రేకెత్తించిందీ సినిమా. మరి ఈ సినిమా అందరి అంచనాలను అందుకుందా? సమీక్షించుకుందాం..
కథ ఏంటంటే..
రైల్వేపోలీస్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ భేరి (రవితేజ) నిజాయితీ గల అధికారి. దూకుడు ఎక్కువే. అందుకే ఎప్పుడూ బదిలీలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఆ ఊరు శివుడు (నవీన్‌చంద్ర) కనుసన్నల్లో ఉంటుంది. అక్కడి రైతులతో బలవంతంగా గంజాయి సాగు చేయించి కలకత్తాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు. గంజాయి సాగు చేయడం, తాగడం, అమ్మడం..
ఇవన్నీ అక్కడి ప్రజలకు సర్వసాధారణమైన విషయం. అలాంటి ఊరి రైల్వేస్టేషన్‌లో లక్ష్మణ్ భేరి బాధ్యతలు తీసుకుంటాడు. ఆ ఊరిలో కలుషిత వాతావరణానికి కారణం శివుడేనని తెలిసి, ప్రజలను ఆ దుర్మార్గుడి చెర నుంచి రక్షించాలనుకుంటాడు. కానీ, తను డ్యూటీ చేయాల్సింది రైల్వేస్టేషన్‌లోనే. అది దాటితే ఊరు తన పరిధిలోకి రాదు. అయినా, శివుడి అంతు చూడాలనుకుంటాడు లక్ష్మణ్ భేరి.
ఓసారి పెద్దమొత్తంలో సరుకును కోల్‌కతాకు రోడ్డు మార్గంలో పంపించాలనుకున్న శివుడి ప్రయత్నం విఫలమవుతుంది. రోడ్డు గుండా తరలిపోతున్న సరుకును సీజ్ చేసే అధికారాలు లేనప్పటికీ రైల్వే ఎస్సైగా లక్ష్మణ్ భేరి ఏ అధికారంతో దాన్ని స్వాధీనం చేసుకున్నాడు?
స్వాధీనం చేసుకున్న సరుకును లక్ష్మణ్ భేరి ఎక్కడ దాచేశాడు? తన సరుకునే తిరిగి తెచ్చుకునేందుకు శివుడు ఏం చేశాడు? రోడ్డు గుండా వెళ్తున్న సరుకు రైల్వే పరిధిలోకి వచ్చేలా.. తద్వారా స్మగ్లర్ శివుడి వ్యాపార సామ్రాజ్యాన్ని నాశనం చేసేందుకు లక్ష్మణ్ భేరి పన్నిన వ్యూహం ఏంటి? అదేనే సినిమా.
కథ విశ్లేషణ..
కథలో కొత్తదనం లేదు. ఈ విషయంలో కొత్త దర్శకుడు భాను భోగవరపు కొంతమేరకే సఫలీకృతుడయ్యారని చెప్పక తప్పదు. రొటీన్ స్టోరీనే తనదైన శైలిలో చూపెట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. హీరోయిజం, ఎలివేషన్లు, పాటలు.. అన్నీ కొత్తగా ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్‌ప్లే కూడా ఆకట్టుకునేలా ఉండాలి. అప్పుడు కథ పాతదైనా ప్రేక్షకులు దాన్ని పెద్దగా పట్టించుకోరు.
ఫలితాలు కూడా మరోలా ఉంటాయి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ‘మాస్ జాతర’ విషయంలోనూ ఫలితం ఇంకోలా ఉండేది. చాలా సన్నివేశాలు రవితేజ పాత సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. దర్శకుడి దృష్టి అంతా హీరో పాత్ర మలచడంపై ఉన్నట్టనిపించింది. ఈక్రమంలో కథను పెద్దగా పట్టించుకోలేదన్న భావన కలిగింది.
నటీనటుల గురించి..
తెర లేచిన తర్వాత తెలంగాణలోని వరంగల్‌లో ప్రారంభమవుతుందీ సినిమా. అందుకే రవితేజకు డైలాగులన్నీ తెలంగాణ యాసలో రాశారు. కానీ, ఈ యాసలో డైలాగులు చెప్పడంలో అక్కడక్కడ విఫలమయ్యారు. సాధా రణ భాషలోనే మాట్లాడారాయన. కథ ఏపీలోని అల్లూ రి జిల్లా అడవివరం గ్రామానికి మారిన తర్వాత అక్కడి అమ్మాయిగా కథానాయకి శ్రీలీల కథలో భాగమవుతుంది.
అందుకే తులసి పాత్రధారి (శ్రీలీల) సంభాషణలు శ్రీకాకుళం మాండలికంలో వినిపిస్తాయి. శ్రీలీల సఫలమైనా, ఆమె తండ్రి పాత్ర (నరేశ్ వీకే)ను కూడా ఆ యాసలోనే మాట్లాడించాలనేది మరిపోయారు. అయితే, 50 ప్లస్‌లోనూ రవితేజ మార్క్ హీరోయిజం, ఆయన స్క్రీన్‌ప్రెజెన్స్, డైలాగ్ టైమింగ్, యాక్షన్.. ఎం టర్‌టైన్‌మెంట్ ఎప్పటిలాగే అహో అనిపించారు. శ్రీలీల పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది.
ఆ పాత్ర నేపథ్యం కథకు బలాన్ని తెచ్చింది. నవీన్‌చంద్ర శక్తివంతమైన విలన్‌గా చాలా బాగా చేశాడు. రవితేజ, నవీన్‌చంద్ర కాంబినేషన్ స న్నివేశాలు బాగున్నాయి. రాజేంద్రప్రసాద్‌కు చాలాకాలం తర్వాత నటనకు ఆస్కారం ఉన్న ఓ మంచి పాత్రలో కనిపించారు. తము ఇచ్చిన పాత్రల పరిధి మేరకు నరేశ్ వీకే, సముద్రఖని రక్తికట్టించారు. సహాయ పాత్రలతో చేసిన కామెడీ పర్వాలేదనిపించేలా ఉంది.
సాంకేతికవర్గం గురించి..
దర్శకుడు భాను స్క్రిప్టును మరింత బలంగా తీర్చిదిద్దాల్సిందన్న అభిప్రాయం కలిగింది. భీమ్స్ సిసిరో లియో నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్, ఎడిటింగ్ బాగున్నాయి. మాస్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకైతే ఈ సినిమా నచ్చుతుంది.