లంబాడాలు ఎస్టీలు కాదు
- ఆ జాబితా నుంచి వారిని తొలగించాలి
- ఆదివాసీల డిమాండ్.. ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట ధర్నా
- గోండ్వాన రాజ్యధికారం దిశగా పోరాటం చేస్తాం
- తుడుం దెబ్బ హెచ్చరిక
ఆదిలాబాద్/ఉట్నూర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): లంబాడాలు ఎస్టీలు కాదని, ఆ జాబితా నుంచి వారిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఉట్నూర్ ఐటీడీఏ ఎదుట బుధవారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి(Adivasi Rights Struggle Committee) (తుడుం దెబ్బ), ఆదివాసి విద్యార్థి సంఘం(Tribal Students Association) ఆధ్వర్యంలో ఆదివాసీ మార్చ్ కార్యక్రమంలో భాగంగా ధర్నా చేపట్టారు. ఉమ్మడి జిల్లా తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. ముందుగా ఉట్నూర్ లోని కొమరం భీం కాంప్లెక్స్(Komaram Bheem Complex) లో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గోండ్వాన రాజ్యధికారం దిశగా పోరాటం చేస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్(Maipathi Arun Kumar), జాతీయ అధ్యక్షుడు కోట్నక్ విజయ్ కుమార్ వెల్లడించారు. డిసెంబరులోగా ఆదివాసుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర రాజధానిలో భారీ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీలో 100% ఉద్యోగాలు ఆదివాసీ గిరిజనులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 1976లో రాజ్యాంగ విరుద్ధంగా ఎస్టీ జాబితాలో చేరిన లంబాడాలు దశాబ్దాలుగా తమ ఉద్యోగ ఉపాధిని కొల్లగొడుతున్నారని అన్నారు.
జీవో 57 ప్రకారం ఐటీడీఏ ఆధ్వర్యంలో 29 ప్రభుత్వ శాఖలలో పి.ఓ సింగల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారులు అరాచకాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిందన్నారు. అడవిలో జీవనం సాగించే ఆదివాసీల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఏజెన్సీ జీవో 141 ప్రకారం ఏజెన్సీ, కుల ధ్రువీకరణ జారీ చేయవద్దని ఉత్తర్వులు ఉన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివాసీ గిరిజనులు తమ హక్కుల సాధన కోసం చేస్తున్న ధర్నా సందర్భంగా ఇంద్రవెల్లి నుంచి ఉట్నూర్ మీదుగా మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, నెల్లూరు తదితర సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఆర్టీసీ బస్సులు రెండున్నర గంటల పాటు ఉట్నూర్ క్రాస్ రోడ్ వద్ద నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.