21 May, 2026 | 3:17 AM

అభివృద్ధి,ఆదాయవృద్ధికి ల్యాండ్ పూలింగ్ దోహదం

21-05-2026 01:59 AM

హనుమకొండ రూరల్, మే 20(విజయ క్రాంతి): జిల్లాలోని ఆత్మకూర్ మండల కేంద్రంలో కుడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లేఅవుట్ ల్యాండ్ పూలింగ్ ను బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్ తదితరులు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేపడుతున్న ల్యాండ్ పూలింగ్, లేఅవుట్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి, పనులను మరింత సమర్థవంతంగా చేపట్టాలని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా లేఅవుట్, రహదారులు, ప్లాటింగ్ పనులు ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయని అన్నారు.ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ప్రజలు తమ భూములను అభివృద్ధి కోసం అందించడం వల్ల వారి భూముల విలువ పెరగడంతో పాటు ఆదాయం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

అలాగే అభివృద్ధి చెందిన లేఅవుట్ ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రణాళికాబద్ధమైన లేఅవుట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో ఆధునిక లేఅవుట్లను అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కుడా పిఓ అజిత్ రెడ్డి, స్థానిక సర్పంచ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.