గద్వాల,(విజయక్రాంతి): డెంగ్యూ రోగులకు ప్లేట్‌లెట్స్ అందించే సౌకర్యం మరింత మెరుగుపరుచుటకు బ్లడ్ బ్యాంక్‌లో సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ (SDP) మిషన్‌ను జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ప్రారంభించారు. గురువారం గద్వాల ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ (SDP) మిషన్‌ను కలెక్టర్ వైద్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డెంగ్యూ వంటి వ్యాధులలో రోగుల ప్రాణాలను కాపాడటంలో ప్లేట్‌లెట్స్ అత్యంత కీలకమని వివరించారు. మిషన్ ద్వారా రోగులకు అత్యవసర సమయంలో ప్రాణాధారమైన ప్లేట్‌లెట్స్‌ను సమయానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
డెంగ్యూ వంటి రక్త సంబంధిత వ్యాధుల కారణంగా ప్లేట్‌లెట్స్ అవసరమయ్యే సమయంలో, దూరంగా ప్రయాణించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సదుపాయం అందుబాటులో ఉందని, ప్రజలందరూ అవసరమైనప్పుడు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని నూతన సాంకేతికతలు మరియు పరికరాలు అందుబాటులోకి తీసుకోస్తామని అన్నారు. వైద్యాధికారులు మరియు టెక్నీషియన్లను (సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్) మిషన్ ఎలా పనిచేస్తుందో,మిషన్ యొక్క పూర్తి ప్రక్రియను కలెక్టర్ కు వివరించారు.
వైద్య సిబ్బంది ఈ సాంకేతికతను సమర్థంగా ఉపయోగించి ప్లేట్‌లెట్స్ అవసరమైన రోగులకు తక్షణ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛత మరియు వ్యాధి నివారణ చర్యలను పాటించాలన్నారు. సీజనల్ వ్యాధులకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్క వైద్యాధికారి, సిబ్బంది తమ బాధ్యతను మరింత నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి, వారి ఆరోగ్యాలను కాపాడే దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వినోద్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పార్వతమ్మ, డా.మాదవి, అసోసియేట్ పాతాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్ వృషాలి, ఇతర వైద్యులు, టెక్నీషియన్ రామ కృష్ణ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.