రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య దిగ్భ్రాంతికరం
రేవంత్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నేతలను వేధించడం కోసమే మళ్లించడం వల్లే.. ప్రజల రక్షణ, భద్రత గాలిలో కలిసిపోయిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య హత్యకు గురైన వార్త రావడం దిగ్భ్రాంతికరమని కేటీఆర్ పేర్కొన్నారు.
సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఒక యువకుడిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందని, ఇది సామాన్య పౌరుల్లో పెరుగుతున్న అభద్రతా భావానికి అద్దం పడుతోందన్నారు. నేరాల నివారణ, ప్రజా భద్రతపై దృష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజె న్స్ వ్యవస్థలను.. ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వ తీరును విమర్శించే సోషల్ మీడియా గొంతులపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు భారీగా పెరిగినట్లు తాజా ఎన్సీఆర్బీ నివేదికలు చెబుతున్నాయని, ఇది ప్రస్తుత ప్ర భుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు.






