19-01-2026 12:00:00 AM
రెండవ వార్డ్‌లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, జనవరి 18 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ విస్తృతంగా పర్యటించి, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అభివృద్ధి పనుల పురోగతిని ఆయన నేరుగా పరిశీలించారు. వార్డు ప్రజలతో ఎమ్మెల్యే మదన్ మోహన్ సన్నిహితంగా మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
స్థానికులు తమ సమస్యలను ప్రత్యక్షంగా ఎమ్మెల్యేకి వివరించగా, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రస్తావించిన చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే అధికారులు నోట్ చేసుకునేలా ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల్లో తమ వార్డులో ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని, కేవలం మదన్ మోహన్ ఎమ్మెల్యే అయ్యాకే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
గత రెండు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషిని ప్రజలు ప్రశంసించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అక్కడికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ ఏఈఈ పెండింగ్లో ఉన్న పనులు, ప్రజల సమస్యలను నమోదు చేసుకొని, వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ వార్డు అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.