14 May, 2026 | 7:10 AM

విద్యార్థులకు లీకుల ‘పరీక్ష’

21-06-2024 12:50 AM

నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా దుమారం 

  • బీహార్‌లో పేపర్ లీక్‌పై స్పష్టమైన ఆధారాలు

అధికార, ప్రతిపక్ష పార్టీల పరస్పర ఆరోపణలు 

ఏమీ పట్టనట్టుగా ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం

లీకేజీ స్పష్టమైనా పరీక్ష రద్దుకు సుప్రీం ససేమిరా 

పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు

* నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. అసలు పేపర్ లీకే కాలేదని ఎన్టీఏ, కేంద్రం వాదిస్తుండగా.. పేపర్ లీక్‌పై అనేక చోట్ల స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. మరోవైపు నీట్‌ను రద్దుచేయాలని దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నా... నీట్ కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం కూడా స్పష్టంచేసింది. నీట్ పేపర్ లీక్‌పై బీహార్‌లో అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకొంటున్నారు. 

* ఓ రాష్ట్ర మంత్రే తనకు స్వయంగా నీట్ పేపర్ కోసం రికమెండేషన్ లేఖ ఇచ్చాడని పోలీసులు అరెస్టు చేసిన ఓ విద్యార్థి చెప్పగా, ఈ కుంభ కోణం సూత్రధారి సికందర్ యదువేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి సహాయం చేశాడని రాష్ట్ర డిఫ్యూటీ సీఎం విజయ్ సిన్హా ఆరోపించారు. దేశంలో ఇంత గొడవ జరుగు తున్నా ప్రధాని కనీసం పట్టించుకోకపోవ టంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. 

* నీట్ లీకేజీపై దేశవ్యాప్తంగా అనేక హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావటంతో సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకొన్నది. అన్ని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై విచారణ నిలిపివేసి తమకు పంపాలని ఆదేశించింది. 

వ్యాపం దేశవ్యాప్తం!

మధ్యప్రదేశ్‌లో ఒకప్పుడు వెలుగుచూసిన వ్యాపం కుంభకోణాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని చెప్పుకొంటున్నారు. కానీ ఏ కారణం చేతనో ఆయన పేపర్ లీక్‌లను ఆపలేకపోయారు. లేదా ఆపాలని అనుకోవటం లేదు.

 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 

సీబీఐతో విచారణ జరిపించాలి

నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్డీయే సర్కార్ పూర్తిగా విఫలమైంది. నీట్‌పై నమ్మకం కలిగించేలా వ్యవహరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. నీట్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలి.

 మంత్రి శ్రీధర్‌బాబు

  • యుద్ధాన్ని ఆపినవారు.. పేపర్ లీక్‌ను ఆపలేకపోయారు
  • విద్యా వ్యవస్థను ఆక్రమించిన బీజేపీ, ఆరెస్సెస్
  • కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, జూన్ 20: నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్‌లో ఒకప్పుడు వెలుగుచూసిన వ్యాపం కుంభకోణాన్ని బీజేపీ దేశవ్యాప్తం గా విస్తరిస్తున్నదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను ఆరెస్సెస్, బీజేపీ శక్తులు గుప్పిటపట్టాయని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్‌పై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఆరెస్సెస్, బీజేపీ చేతిలో విద్యా వ్యవస్థ

భారతీయ విద్యా వ్యవస్థను ఆరెస్సెస్, బీజేపీ ఆక్రమించాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. నీట్ పేపర్‌ను లీక్ చేయటం దేశద్రోహ చర్యే అవుతుందని అన్నారు. ‘బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ విద్యా వ్యవస్థను ఆక్రమించటమే పేపర్ లీకులకు కారణం. ఆరెస్సెస్ ఆక్రమణను తొలగించనంత కాలం పేపర్ లీకులు జరుగుతూనే ఉంటాయి.  ‘ఈ ఘటనలకు కారణం మన విద్యా సంస్థలు రాజీ పడటమే. యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లను సామర్థ్యం ప్రాతిపదికన కాకుండా ఒక సంస్థకు చెందినవారిని మాత్రమే నియమిస్తున్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు మోదీ ఏం చేశారో.. ఇప్పుడు పేపర్ లీకులతో విద్యా వ్యవస్థకు అదే చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తి ధ్వంసం కావటమే కారణం’ అని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీలకు కేంద్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అని అందరికీ తెలుసు అని దుయ్యబట్టారు. 

వ్యాపంను విస్తరిస్తున్న మోదీ

మధ్యప్రదేశ్‌లో ఐదారేండ్ల క్రితం వెలుగు చూసిన వ్యాపం కుంభకోణాన్ని రాహుల్‌గాంధీ ఉటంకించారు. ‘వ్యాపం కుంభకోణం మధ్యప్రదేశ్‌లో జరిగింది. దానిని ఇప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి’ అని ఆరోపించారు. ౫౬ ఇంచుల చాతీ ఉన్న ప్రధాని అని బీజేపీ ప్రచారం చేయటంపైనా రాహుల్ సెటైర్లు వేశారు. మోదీ ౫౬ ఇంచుల చాతీ ఇప్పుడు ౩౦ ఇంచులకు తగ్గిందని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీలపై మోదీ ఇప్పుడు నోరు మెదుపకపోవటానికి కారణం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఉండటమేనని ఆరోపించారు. లోక్‌సభలో స్పీకర్ ఎన్నికకు జేడీయూ మద్దతు అవసరం. నీట్ కుంభకోణంలో జేడీయూ నేతలే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  

యువతను అవమానించిన రాహుల్: బీజేపీ

రాహుల్‌గాంధీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. వరుసగా మూడుసార్లు ఫెయిలైన రాహుల్‌గాంధీ (లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటాన్ని ఉద్దేశించి) మధ్యప్రదేశ్, గుజరాత్ యువత ను అవమానిస్తారా? అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. పరీక్షల నిర్వహణపై ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని సూటిగా లేవనెత్తాలని, అంతేగానీ ఒక ప్రాంత యువతను అవమానించేలా ఎలా మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానిపై రాహుల్‌కు వ్యక్తిగ కక్ష ఉంటే.. ఆయనపైనే విమర్శలు చేయాలని చురకలంటించారు.