14 May, 2026 | 6:00 AM

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఈడీ, ఐటీ ముప్పేట దాడి

21-06-2024 12:52 AM
  • ఉదయం 6 గంటల నుంచి ఎమ్మెల్యేతో పాటు సోదరుడి ఇళ్లు, ఆఫీసుపై మూకుమ్మడి సోదాలు
  • మైనింగ్ సీనరేజ్, ఫెనాల్టీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం రూ. 341 కోట్లు!
  • బినామీల పేరుతో అక్రమ మైనింగ్?
  • కీలకపత్రాలతో పాటు లగ్జరీ కారు పత్రాలపై ఆరా

పటాన్‌చెరు, జూన్ 20: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఈడీ అలజడి మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఈడీ, ఐటీ అధికారులు తెలంగాణలో హల్‌చల్ చేయగా, ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ బీఆర్‌ఎస్ పటాన్‌చెరువు ఎమ్మెల్యే టార్గెట్‌గా గురు వారం ఉదయం 5 గంటల నుంచే ఈడీ దాడులు జరిగాయి. ఈడీ, ఐటీ అధికారులు గూడెం మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు కార్యాలయాలు,  సోదరుడితో పాటు బంధువుల ఇంటిపై ఏకకాలంలో దాడులను నిర్వహించారు. గూడెం బ్రదర్స్‌కు సంబంధించిన లక్డారంలోని సంతోష్ గ్రానైట్  అండ్ క్వారీస్ పరిశ్రమలో ఈడీ అధికారులు సోదాలను నిర్వ హించారు.

సంతోష్ గ్రానైట్‌కు యజమానిగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి 72.87లక్షల టన్నుల మెటల్ తవ్వేసి కేవలం రూ.8.48లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్లు ఈడీ, ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే సీనరేజ్, ఫెనాల్టీ కలిపి సుమారు రూ.341 కోట్లను పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇందుకు సంబంధించిన కేసులోనే గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు సమాచారం.

అలాగే బినామీల పేరుతో గూడెం బ్రదర్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించడంతో పాటు అందుకు సంబధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బృందాలుగా వచ్చిన సుమారు 40 మంది ఈడీ, ఐటీ అధికారులు మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డితో పా టు నిజాంపేటలోని మహిపాల్‌రెడ్డి అల్లుడి ఇంట్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి లక్డారంలో అక్రమ క్వారీ విషయంలో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. 

13 గంటలు సాగిన సోదాలు..

ఈడీ అధికారులు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 13 గంటలపాటు ఏకధాటిగా సోదాలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం గూడెం మహిపాల్‌రెడ్డి రూ.3 కోట్ల విలువైన ల్యాండ్ క్రూయిజర్ కారు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో ల్యాండ్ క్రూయిజర్ కొనుగోలు పత్రాలతో పాటు మరిన్ని అక్రమ, బినామీ మైనింగ్‌లకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరిగింది. గతంలో మెదక్ సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మహిపాల్ రెడ్డి ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలవడంతో పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ లక్డారంలో క్వారీలలో అక్రమాలు జరిగాయని గూడెం మహిపాల్‌రెడ్డిపై గతంలో  రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

రాజకీయ కుట్రలో భాగమే: ఎమ్మెల్యే గూడెం

రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసంబద్ధ కారణాలతో ఈడీ, ఐటీ శాఖల అధికారులతో తనపై దాడులు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పులాంటిదని తెలిపారు. ఈడీ, ఐటీ దాడులు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తన 34 ఏళ్ల రాజకీయ జీవితం తెల్లకాగితం లాంటిదని పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారన్నారు. ఈడీ, ఐటీ అధికారులు చేపట్టిన సోదాలకు సంపూర్ణంగా సహకరించామని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి  వ్యాపారాలు నిర్వహించలేదన్నారు.

ఏ సమస్యనైనా చట్టపరంగా ఎదురుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల మద్దతుతో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గుర్తుచేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు ఈడీ, ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలలో ఏమీ లభించలేదన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తనపై ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప ఐటీ, ఈడీ పేరుతో దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, వారికి జవాబుదారుగా పనిచేస్తానని చెప్పారు.