14 May, 2026 | 7:59 AM

చినుకు రాలక రైతు కంట చెమ్మ!

21-06-2024 12:46 AM
  • ఊరించి.. ఉసూరుమనిపించిన సీజన్

జిల్లాల్లో పత్తి, జొన్న, మక్కలు నాటిన రైతులకు కష్టాలు

మొలకెత్తిన పంటను కాపాడుకునేందుకు భగీరథయత్నం

ఈసారి నైరుతి ముందుగానే వచ్చింది. తొల కరిగా పలకరించింది. రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. వరుసగా చెదురు మదురు వర్షాలు కురిశాయి. వడివడిగా దుక్కులు దున్నారు. పత్తి, జొన్న, మక్కల విత్తనాలు నాటారు. ఇంతలోనే వరు ణుడికి కన్నుకుట్టిందో ఏమో ముఖం చాటేశాడు. కాలం వెనక్కి వెళ్లింది. దీంతో మొలకలు వేసిన పంట వాడు దశకు చేరుకున్నది. విత్తిన విత్తనాలు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు భగీరథ యత్నం చేస్తున్నారు. బకెట్లు, బిందెలతో మొలకల మొదళ్లలో నీరు పోస్తున్నారు. కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు ట్యాంకర్లు, స్ప్రింకర్లతో నీరు పెడుతున్నారు. ఎప్పుడెప్పుడు వానలు కురుస్తాయా.. అనే ఆశతో రైతులు దీనంగా మొగులు వంక చూస్తున్నారు. 

  •  తొలకరి వానలకే ‘నైరుతి’ పరిమితం
  • ఊరించి ఉసూరుమనిపించిన సీజన్
  • బిందెలు, బకెట్లతో నీరు పెడుతున్న రైతాంగం

విజయక్రాంతి నెట్‌వర్క్, జూన్ 20: నైరుతి రుతుపవనాలు ముందే రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా చెదురు మదురు వర్షాలు కురిపించాయి. ఆ తర్వాత వానలు ఆగిపోయాయి. ఈలోపు సాగు ప్రారంభించిన రైతులకు చుక్కెదురైంది. కొన్ని జిల్లాల్లో నాటి పత్తి విత్తనాలు మెలుకెత్తనే లేదు. ఇప్పటికే పత్తి సాగు చేస్తున్న ఒక్కో రైతు ఎకరానికి కలుపుకూలితో కలుపుకొని రూ.20 వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. జొన్న సాగు చేస్తున్న రైతు ఎకరానికి రూ.6 వేల చొప్పున డబ్బు వెచ్చించారు. విత్తనాలు మొలకెత్తే దశలో వాన జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు నాటి రెండు వారాలు దాటుతున్నా, ఇప్పటికీ మొలకలు వేయలేదని వాపోతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లా పరిధిలోని మొత్తం 33 మండలాలకు 25 మండలాల్లో ఈ సీజన్‌లో వానలు అంతంతమాత్రంగా కురిశాయి. దీంతో పంటల సాగు మందకొడిగా జరుగుతున్నది. జూన్ రెండు వారం పూర్తయ్యే నాటికి జిల్లాలో సుమా రు 95.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 59.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అన్ని పంటలు కలిపి ఈ సీజన్‌లో 5,25,841 ఎకరాల్లో పంటు సాగవుతాయనే అంచనా ఉండగా, ఇప్పటివరకు కేవలం 81,433 ఎకరాల్లో మాత్రమే సాగు షురూ అయింది. అంటే కేవలం 16 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగు మొదలైనట్లు.

మహబూబాబ్‌నగర్ జిల్లాలో..

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 3.23 లక్షల ఎకరాల్లో పంటు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇప్పటివరకు కేవలం 51,424 ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభించారు. నామామాత్రంగా పత్తి సాగు ప్రారంభమైంది. రైతులు విత్తనాలు నాటి అవి ఎప్పుడు మొలకెత్తుతాయా..  అని ఎదురుచూస్తున్నారు.

భూపాలపల్లి జిల్లాలో..

భూపాలపల్లిలో పత్తి సాగుకు పూనుకున్న రైతులు ఇప్పటికే విత్తనాలు నాటారు. ఆశించినంత వర్షపాతం లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా చేనుకు నీరు పెడుతున్నారు. చెరువులు, కుంటల్లో చుక్కనీరైనా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు బోర్ల కింద సైతం పంట సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈసీజన్‌లో రైతులు జిల్లావ్యాప్తంగా 95 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 26 వేల ఎకరాల్లో మాత్రమే సాగు షురూ అయింది. వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తే తప్ప సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.

ఆసిఫాబాద్ జిల్లాలో..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పత్తి సాగుకు పెట్టింది పేరు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా రైతులు ఈ పంటనే సాగు చేస్తారు. ఈ సీజన్‌లో రైతులు 4.6 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీనిలో సింహభాగం 3.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 1,81,115 ఎకరాల్లో విత్తనాలు నాటారు. జిల్లాలో ఇప్పటివరకు నామమాత్రంగా వర్షం కురిసింది. పంట చేతికి రావాలంటే కనీసం 30 సెం.మీ వర్షపాతం కురిస్తే తప్ప పంట చేతికి రావని నిపుణులు వెల్లడిస్తున్నారు.

భద్రాద్రి జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,56,212 ఎకరాల్లో పత్తి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 59,806 ఎకరాల్లో మాత్రమే రైతులు పత్తి సాగు ప్రారంభించారు. వరి 1.60 లక్షల్లో వరి సాగు చేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 140 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నది. అన్ని పంటలు  కలిపి మొత్తంగా 4,71,622 ఎకరాల్లో సాగు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,12,316 ఎకరాల్లో మాత్రమే ప్రారంభమైంది.

కరీంనగర్ జిల్లాలో..

కరీంనగర్ జిల్లాలో జూన్ రెండో వారం ముగిసే నాటికి - 11శాతం వర్షపాతం నమోదైంది. మూడు మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం ఎక్కువగా నమోదైంది. ఐదు మండలాల్లో తక్కువ వర్షపాతం, నాలుగు మండలాల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. ఒక మండలంలో అసలు వర్షపాతం నమోదే కాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 63.9 మి.మీ ఉండాల్సి ఉండగా 57.1 మి.మీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 3,45,070 ఎకరాల్లో పంటలు సాగవుతాయని రైతులు అంచనా వేయగా, దీనిలో వరి 2,74,500 ఎకరాల్లో సాగు చేయనున్నారు. పత్తి 48,000 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు నామమాత్రంగా సాగు ప్రారంభమైంది. వర్షాలు కురవకున్నా ప్రాజెకులు, చెరువుల్లో నీటి లభ్యత ఉంటే రైతులు ధైర్యం చేసి వరి సాగు ప్రారంభించి ఉండేవారు. కానీ సాధారణ వర్షపాతమైనా నమోదు కాకపోవడటంతో ఆందోళన చెందుతున్నారు. తలాపునే మానేరు డ్యాం ఉన్నా నీటి లభ్యత లేకపోవడం రైతులను బాధపెడుతోంది.

దేవుడే దిక్కు..

మాకు  నాలుగు ఎకరాల భూమి ఉంది. మేం ఎండాకాలంలోనే దుక్కులు దున్నాం. 20 రోజుల క్రితం వర్షాలు కురువడంతో పత్తి విత్తనాలు నాటాం . ఆ తర్వాత తిరిగి వానలు ఆగిపోయాయి. అనుకులం గా వర్షాలు కురువకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. అప్పడుప్పుడు పడుతున్న వర్షాలతో ప్రయోజనమేమీ లేదు. మాకు దేవుడే దిక్కు .

 నౌగడే రాజు, రైతు, వాంకిడి, ఆసిఫాబాద్ జిల్లా

మూడు ఎకరాల్లో పత్తి గింజలు పెట్టిన..

నేను మూడెకరాల్లో పత్తి గింజలు పెట్టిన. తొలకరి వానలు పడంగనే దుక్కి దున్నుకుని విత్తనాలు వేసినా. ఆ తర్వాత  చినుకు రాలలె. వానల కోసం ఎదురు చూస్తున్నాం. వేసిన విత్తనాలు చెడిపోతాయని భయపడుతున్నాం. రోజూ నీళ్లు చల్లుతున్నాం. వానలు పడితేనే విత్తనాలు మొలకెత్తుతయ్. లేకుంటే పెట్టుబడి నష్టపోతాం.

 చిదురాల మధూకర్‌రెడ్డి రైతు మహాముత్తారం జయశంకర్ భూపాలపల్లి

చినుకు పడితేనే చిగురు వస్తుంది..

మేం రెండెకరాల్లో జొన్న సాగు చేస్తు న్నాం. చినుకు రాలకపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయి. ముందు కురిసిన వానలకు విత్తనాలు నాటాం. ప్రస్తుతం కలుపు తీస్తున్నాం. ఆశించినంత వానలు కురిస్తే పంట చేతికి వస్తుంది. వర్షం పడితేనే మా బతకులు మారుతాయి. లేకుంటే మా గతి అంతే. అప్పుల్లో కూరుకుపోతాం.

  శ్రీశైల, రైతు, దాశాయిపల్లి మహ్మదాబాద్, మహబూబ్‌నగర్