అగ్రిమెంట్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జులై 29 (విజయక్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా నియమాలు, జీతాల చెల్లింపులు, ఏజెన్సీల బాధ్యతలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ని యామకాలు సంబంధిత గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.
ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఆయా ఏజెన్సీలతో ఈ నెల 25వ తేదీలోగా అగ్రిమెంట్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ విధానంతో ఉద్యోగుల హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు ఏజెన్సీల బాధ్యతను మరింత పెంచడం లక్ష్యమన్నారు. ప్రస్తుతం జిల్లాలో (8) ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 577 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. వీరి సేవా భద్రత, వేతనాల సకాలంలో చెల్లింపు, ఒప్పంద నిబంధనల అమలు, బాధ్య తాయుత పరిపాలనకు ఈ త్రైపాక్షిక ఒప్పంద విధానం దోహదపడుతుందని స్పష్టం చేశారు.






