calender_icon.png 12 September, 2024 | 11:43 PM

భూభారం తగ్గిద్దాం

11-07-2024 12:00:00 AM

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

పారిశ్రామికీకరణ అనంతరం ఉద్యోగ ఉపాధి అవ కాశా లు మెరుగుపడటంతో 1804 నాటికి ప్రపంచ జనాభా 100 కోట్లు ఉండగా, 2023కి 800, 2037కి 900, 2057 నాటికి 1000 కోట్లకు చేరి భూమి మో యలేని స్థితికి చేరుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ప్రస్తుత ప్రపంచ జనాభాలో సగం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే (అందులో చైనా 144, భారత్ 145 కోట్లతో ముందువరుసలో) ఉంది. ‘ప్రపంచ ఫెర్టిలిటీ రేటు’ (టి.ఎఫ్.ఆర్) 2.1గా కాగా, ఇదే సమయంలో ఆయుష్షు (లైఫ్ ఎక్సెపెటెన్సీ) సంయుక్తంగా 73.2 సంవత్సరాలు ఉంది. సగటున పురుషులు 70.8, స్త్రీలు 75.6 ఏండ్లు బతుకుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

శిశుమరణాలు ప్రతీ 1000 మందికి 26.1గాను, 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు 35.8గా ఉంటున్నాయి. 2019 నివేదికలో ప్రపంచ జనాభాలో 430 కోట్లమంది (55.7%) పట్టణాల్లో, మిగిలిన సుమారు 45% జనాభా గ్రామప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. అదే విధంగా ప్రతీ చదరపు కిలోమీటరుకు 52 మంది నివసిస్తున్నట్టు జనసాంద్రత గణాంకాలు చెబుతున్నాయి. మన దేశ జనసాంద్రత 464 కాగా,   అమెరికా జనాభా 33 కోట్లు వుండగా, జనసాంద్రత 36 మాత్రమే. దీన్నిబట్టి అభివృద్ధి వేగంలోని సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకోవచ్చు.   

అన్ని చోట్లా అభివృద్ధి ఒకే విధంగా లేకపోవడంతో అనేక అసమానతలు ఏర్పడి పలు సమస్యలు శతాబ్దాల తరబడి (నేటికీ) పట్టి పీడు స్తు న్నాయి. కారణం ప్రధానంగా అధిక జనాభాయే. ముఖ్యంగా భారతదేశంలో ప్రభుత్వాలు అందరికీ అన్ని వసతులు కల్పించలేక సతమ తమవుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలసలు వెళుతున్నారు. వారి వెతలు నేటికీ మన కండ్ల ముందు కనపడుతున్నాయి. మేధోవలస (బ్రెయిన్ డ్రెయిన్) సర్వసాధారణమైంది. ఆయా దేశాల్లో మెరుగైన సదుపాయాలు ఉండడంతో వారు అనేక నూతన ఆవిష్కరణలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన దేశంలో నాణ్యమైన విద్య, వైద్యం అం దడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వాలు అధిక సంఖ్యలో పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించాలి. దిగుమతులపై ఆధారపడే స్థితినుంచి బయటపడాలి. ఎంత స్థూల జాతీయ ఆదాయం (జి.డి.పి), తలసరి ఆదాయం పెరిగినా దేశం, ప్రజలు పేదరికాన్ని చవిచూడాల్సి వస్తుంది. ‘యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ జనాభా దినోత్సవ వేళ ప్రభుత్వాలను, ప్రజలను చైతన్య పరచాలి. శాస్త్రీయ దృష్టిని పెంపొందించాలి. భూమి తక్కువ-, జనాభా ఎక్కువ వల్ల సంభవించే సంక్షోభాలను వివరించాలి. 

 ఐ. ప్రసాదరావు, సెల్: 6305682733