30 July, 2026 | 12:49 AM

విద్యపై భరోసా కల్పించడం సవాలే

30-07-2026 12:00 AM

మల్లాది వేంకట గోపాలకృష్ణ :

ఒక దేశ భవిష్యత్తు, దాని అభ్యుదయం యువతరం మనుగడ మీద, యువత అభివృద్ధి మీద మాత్రమే ఆధారపడి ఉంటుందన్నది ప్రపంచంలో ఎవరూ తిరస్కరించలేని సత్యం. ఆ నిజాన్ని ఇజంగా మార్చుకున్న భారత ప్రధాని మోదీ యువతరం అభివృద్ధి చెందాలంటూ గొప్ప కలలు కంటున్నారు. ఆ కలలను సాకారం చేసుకోవడం కోసం యువతరంలో అనంతమైన ధైర్యాన్ని, స్థైర్యాన్నీ ఎన్నో ఏళ్లుగా నూరిపోస్తూ వస్తున్నారు.

కానీ, అంతగా యువతరం అభివృద్ధి కోసం పరితపించే ఆయన, కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విద్యాశాఖకు సరైన వ్యక్తిని, రాజకీయ శక్తిని ఎంపిక చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని హస్తినలోని తాజా రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. దేశ ప్రజల మౌలిక హక్కు అయిన విద్యను, విద్యావ్యవస్థను పూర్తిగా పాడుచేస్తే, ఇష్టారాజ్యంగా ఆ వ్యవస్థ పునాదులను అవినీతి, నిర్లక్ష్యం, ఆశ్రిత పక్షపాతం, స్వార్థ రాజకీయాలు వంటి అవలక్షణాలతో కుప్పకూలేలా చేస్తే సమాజం చూస్తూ ఊరుకోదని భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన తాజా ఉదంతం ద్వారా మరోసారి నిరూపితమైంది.

ఢిల్లీ వీధుల్లో పెల్లుబికిన విద్యార్థి లోకం ధర్మపోరాటానికి, నిరసనల ఉద్ధృతికి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది కేవలం ఒక మంత్రి నిష్క్రమణ మాత్రమే కాదు. స్వార్థ రాజకీయాలు, అధికార అహంకారంతో కోట్లాది మంది అభ్యర్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టిన ఒక విఫల వ్యవస్థపై భావి భారత పౌరులు సాధించిన చారిత్రాత్మక విజయం!

భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ

ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగిన కాలం భారత విద్యారంగానికి అత్యంత దురదృష్టకరమైన చీకటి రోజులన్న సత్యం కాస్త ఆలస్యంగానైనా బయటపడింది. ఆయన హయాంలో ప్రాథమిక స్థాయి నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు విద్యావ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. తన హయాంలో జరిగిన తప్పులను, లోపాలను, లోటుపాట్లను, అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు, తన ఏలుబడిలో విద్యావ్యవస్థ అద్భుతంగా ఉందన్న అపోహను దేశ ప్రజలకు కల్పించేందుకు ధర్మేంద్ర ప్రధాన్ చేయని ప్రయత్నాలు లేవు, వేయని ఎత్తుగడలు లేవు, ఒడిగట్టని అరాచకాలు లేవు.

దేశ బడ్జెట్‌లో విద్యా వ్యవస్థకు కేటాయిస్తున్న లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం పూర్తిగా వృథా అవుతోందన్న సత్యాన్ని అటు పాలకులు, ఇటు ప్రజలు గుర్తించలేకపోయారు. ధర్మేంద్ర ప్రధాన్ దేశంలోని విద్యావ్యవస్థలోనూ, ఆ వ్యవస్థకు అనుసంధానమై ఉన్న అన్ని రకాల ఉపవ్యవస్థల్లోనూ అత్యంత చాకచక్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన వైఫల్యాలను కప్పిపుచ్చిన తీరు అత్యంత గర్హనీయం.

సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాల్లో దొర్లిన తీవ్రమైన తప్పులు, పారదర్శకత లేని విధానాలు పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీశాయి. నిజానికి ఆ విష సంస్కృతి బయటపడింది కాబట్టి అవలక్షణం దేశ ప్రజల దృష్టికి వచ్చింది. బయటపడనివి ఇంకా ఎన్నున్నాయో?

‘నీట్’ అతిపెద్ద కుంభకోణం

ధర్మేంద్ర ప్రధాన్ హయాంలో దేశంలో వైద్య విద్యను అభ్యసించాలని కలలు కనే లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల రక్తాన్ని పీల్చేలా నీట్ నిర్వహణ తయారవడం నిజానికి ఈ దేశం చేసుకున్న దురదృష్టం. ప్రశ్నపత్రాల లీకేజీలు, చివరి నిమిషంలో దొడ్డిదారిన గ్రేస్ మార్కుల కేటాయింపు, బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బహిరంగంగా సాగిన అవినీతి నెట్‌వర్క్‌లు, లోపభూయిష్టమైన నీట్ పరీక్ష నిర్వహణ, విద్యాశాఖను మాత్రమే కాక మొత్తంగా కేంద్ర ప్రభుత్వంపై దేశవాసుల్లో అందనంత ఎత్తున ఉన్న విశ్వసనీయతను పాతాళానికి దిగజార్చాయి.

జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీయే కాంట్రాక్టు ఏజెన్సీల చేతుల్లో పావుగా మారడం శోచనీయం. పరీక్షల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టి, పూర్తిగా వాళ్ల స్వలాభాల కోసం పర్యవేక్షణను గాలికి వదిలేయడం ప్రధాన్ ఆధ్వర్యంలోని కేంద్ర విద్యాశాఖ చేసిన అతిపెద్ద తప్పు.

కేంద్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల్లో ప్రతిభకు కాకుండా రాజకీయ భావజాలానికి, స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ యూనివర్సిటీలను రాజకీయమయం చేయడం మరో క్షమించరాని పెద్ద తప్పు. ఫలితంగా ఉన్నత విద్యలో పరిశోధనలు, ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ పాలనలో నివేదికలు, ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలతో పైపైన మెరుగుల్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు తప్ప, అస్తవ్యస్తమైపోతున్న వ్యవస్థను బాగుచేసేందుకు కనీస ప్రయత్నం చేయలేదు.

లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి అరుస్తున్న వేళ, ‘ఎలాంటి లీకేజీలు జరగలేదు, ఎన్టీయే సురక్షితమైనది’ అంటూ ప్రారంభంలో ఆయన చేసిన బాధ్యతారాహిత్య ప్రకటనలు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. అంతటితో ఆగక, తమ ఆక్రోశాన్ని తెలియజేస్తున్న విద్యార్థుల నిరసనను అణచివేయడానికి పాలక వర్గాలు మరొక కుట్రపూరితమైన ఎత్తుగడను ప్రయోగించాయి.

ఈ ఆందోళనల వెనుక ‘విదేశీ శక్తులు ఉన్నాయని, దేశాభివృద్ధిని కోరుకోని కుట్రదారులు, స్పాన్సర్‌షిప్‌లతో పనిచేస్తున్న హిందూ వ్యతిరేక, జాతి వ్యతిరేక శక్తులు చొరబడ్డాయని’ ప్రచారం చేస్తూ, విద్యార్థుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారు. తప్పులను దిద్దుకోవడానికి బదులు విద్యార్థుల నైతిక నిబద్ధతను శంకించడం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టకే తీరని అవమానకరంగా పరిణమించింది.

బీజేపీకి కోలుకోలేని దెబ్బ

ఒకవైపు ప్రధాని మోదీ యువత నైపుణ్యాలే దేశానికి మూలస్తంభమని నిరంతరం ఆకాంక్షిస్తూ, విద్యార్థుల బంగారు భవిత కోసం వినూత్నమైన కలలు కంటున్నారు. కానీ, మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ ఆ కలల పునాదులనే సమూలంగా పెళ్లగించే పనులు చేస్తూ వచ్చారు. ఈ పరిణామం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజకీయంగా, నైతికంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. దేశంలోనే అత్యంత కీలకమైన యువ ఓటుబ్యాంకులో ప్రభుత్వం పట్ల తీవ్రమైన నమ్మకద్రోహ భావన పాదుకుపోవడానికి ప్రధాన్ కారణం కావడం ఆలోచించదగ్గ విషయం.

పార్టీ ప్రతిష్టను, ప్రధాని ఆశయాలను ప్రధాన్ పూర్తిగా నీళ్లపాలు చేశారన్న నిజాన్ని ఇప్పుడు దేశం మొత్తం గుర్తించింది. ప్రధాన్‌ను కుర్చీకి దూరం చేయకపోతే మొత్తంగా కేంద్ర ప్రభుత్వమనే పడవే మునిగిపోయే పరిస్థితిలోకి జారిపోతుందన్న సత్యాన్ని గుర్తించిన ప్రధాని, పార్టీ పెద్దలు కాస్త ఆలస్యమైనా సరే ఆయనను తప్పించడం అభినందించదగ్గ విషయం.

విద్యావ్యవస్థకు శస్త్రచికిత్స అవసరం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఒక తాత్కాలిక ఊరట మాత్రమే. సమస్య ఒక వ్యక్తితో పోయేది కాదు. అసలు మొత్తంగా పాడైపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. అవినీతిమయమైన ఎన్టీయేను రద్దు చేసి, యూపీఎస్సీ తరహాలో రాజ్యాంగబద్ధమైన, పారదర్శకత కలిగిన స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థలు, కోచింగ్ మాఫియా, దళారుల ఆస్తులను జప్తు చేసేలా, వారికి నాన్-బెయిలబుల్ శిక్షలు పడేలా కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నెలకొల్పాలి. ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

యువశక్తే ప్రజాస్వామ్యానికి రక్షణ 

జంతర్ మంతర్ అందించిన సందేశం చాలా స్పష్టమైనది. అధికార గర్వంతో పాలకులు ఎంత విర్రవీగినా, వ్యవస్థలను ఎంతగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూసినా ఈ దేశపు యువత, విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఒక్కటై తిరగబడితే ఏ ప్రభుత్వమైనా, ఎంత పెద్ద శక్తి అయినా దిగిరాక తప్పదు.

భావి భారత పౌరుల శ్రమను, నిరుపేద తల్లిదండ్రుల నిరంతర త్యాగాలను లీకేజీలు శాసించకుండా ఉండేలా ఒక పారదర్శకమైన, భరోసానిచ్చే విద్యా వాతావరణం ఏర్పడినప్పుడే వేలాదిమంది విద్యార్థుల పోరాటానికి సార్థకత లభిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ నాశనం చేసిన విద్యారంగాన్ని పునర్నిర్మించడం ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకత్వానికే కాక, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక పెను సవాల్!

 వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్