10 June, 2026 | 2:44 AM

పూరి గుడిసెలు లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం

10-06-2026 01:29 AM

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలి

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): జిల్లాలో పూరి గుడిసె లేని జిల్లాగా తీర్చిదిద్దాలి అని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారిని పరిశీలించారు. జిల్లాలో ఒక్క పూరిగుడిసె కూడా లేకుండా ‘పూరిగుడిసెలు లేని జిల్లాగా‘ కామారెడ్డిని తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

రామారెడ్డి మండలంలోని వడ్డెర కాలనీ సందర్శించి పూరిగుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మండల కేంద్రంలో పర్యటించిన సందర్భంగా పూరిగుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల పరిస్థితిని కలెక్టర్ ఆశిష్ సంగువాన్ పరిశీలిం చారు. గృహ సౌకర్యం లేని అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి ప్రభుత్వ నిబంధనల మేరకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూరి గుడిసెలో ఉన్నవారిని గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేయాలని, పేమెంట్ సమస్యలు తలెత్తితే ఏబీఎన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా గ్రామస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని తెలిపారు.

అర్హత కలిగిన ప్రతి కుటుంబం ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనం పొందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పనులు వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి విజయపాల్ రెడ్డి, సర్పంచ్ బండి ప్రవీణ్, ఎంపీడీవో నాగేశ్వర్ రావ్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.