10 July, 2026 | 5:13 AM

ఎయిడ్స్‌ను అంతం చేద్దాం

01-12-2024 04:00 AM
  1. నా ఆరోగ్యం.. నా హక్కు నినాదాన్నిచ్చిన డబ్ల్యూహెచ్‌ఓ
  2. నేడు వరల్డ్ ఎయిడ్స్ డే

న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1 సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ‘నా ఆరోగ్యం, నా హక్కు’ అనే నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్‌ను అంతం చేసేందుకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ప్రపంచ దేశాలు సాగాలని పిలుపునిచ్చింది.

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బాధితులకు కూడా ఉత్సాహ కర, సంతృప్తికర జీవనం గడిపే హక్కు ఉందని పేర్కొంది. అలాగే ప్రతి ఒక్కరికీ హెచ్‌ఐవీ నివారణ, చికిత్స, సంరక్షణ సేవలు పొందే హక్కు ఉందనే హామీ ఇవ్వాలని సూచించింది. వ్యాధిగ్రస్థుల పట్ల చూపించే వివక్షను నిర్మూలించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిం ది. బాధితులు వ్యాధితోపాటు పక్షపాత భారాన్ని కూడా మోస్తున్నా రని వివరించింది. 

37.7 మిలియన్ల మందికి హెచ్‌ఐవీ

అత్యంత ముఖ్యమైన ప్రపంచ ప్రజారోగ్య సమస్యల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కూడా ఒకటి. ఈ వ్యాధిని నయం చేసే ఔషధాలను శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ కనుగొన లేక పోయారు. ఈ క్రమంలో 2020 డాటా ప్రకా రం ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ బారినపడి దాదాపు 47.8 మిలియన్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 37.7  మిలియన్ల మంది ప్రజలు హెచ్‌ఐవీతో పోరాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. 

1988లో మొదటిసారిగా

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజ ల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు వ్యాధి బారిన పడి మరణించిన వారిని గౌరవించాల్సిన అవసరాన్ని డబ్ల్యూహెచ్‌ఓలో పని చేసిన జేమ్స్ బన్, థామస్ నెట్టర్‌లు తొలుత గుర్తించారు. ఈ క్రమంలోనే ఏటా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని భావించారు. దీం తో యూఎన్‌ఏఐడీఎస్, డబ్ల్యూహెచ్‌ఓ సంయుక్తంగా మొట్టమొదటిసారిగా 1988 లో ఎయిడ్స్ డేను నిర్వహించాయి.