ఈ యుద్ధం మేం చేయలేం!
పలాయనం చిత్తగిస్తున్న ఉక్రెయిన్ సైనికులు
కీవ్, నవంబర్ 30: రష్యాతో సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ సైనికులు ఒక్కొక్కరిగా పలాయనం చిత్తగిస్తున్నారు. 2022, ఫిబ్రవరిలో రష్యా కీవ్‌పై దండెత్తిననాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది కీవ్ సైనికులు రణరంగాన్ని వదిలి పారిపోయినట్లు అనాధి కారిక గణాంకాలు చెబుతున్నాయి.
గడిచిన ఒక్క ఏడాదిలోనే దాదాపు 50 వేల మంది సైనికులు సైన్యంలో ఎలాంటి సెలువు పెట్టకుండా ఇళ్లకు వెళ్లిపోయారు. అదనంగా సైన్యాన్ని సమీకరించుకోవడానికి ముందు కీవ్ వద్ద కేవలం 3 లక్షల మందే జవాన్లు మిగిలి ఉన్నారు. ‘రష్యన్లు 50 ఫిరంగులను మా సైన్యంపైకి వదులుతుంటే.. అందుకు ప్రతిగా మేం కేవలం ఒక్క ఫిరంగిని మాత్ర మే ప్రయోగించగలుగుతున్నాం.
రష్యా దాడిలో మా స్నేహితుల తలలు ముక్కలవుతున్నాయి. మాదీ అదే పరిస్థితీ అని ఆందో ళన కలుగుతుంది’ అని ఓ ఉక్రెయిన్ సైనికుడు పేర్కొనడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. పోరాడే వారు లేక ఉక్రెయిన్‌కు చెందిన ఉహ్లెదార్ టౌన్ రష్యా వశమైంది.
ఒక్కో యూనిట్లో 120 మంది సైనికులు ఉండాల్సిన చోట చనిపోయిన వారు, పరారీ అయినవారు పోగా ఒక్కోచోట 10 మంది సైనికులు మాత్రమే మిగిలిన సందర్భాలున్నాయి. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా అదనపు బలగాన్ని సమీకరించుకోవాలని, 18 ఏండ్లు నిండినవారిని సైన్యంలో చేర్చుకోవాలని కీవ్‌పై ఒత్తిడి తెస్తోంది.
నాటోలో చేరితే యుద్ధానికి ముగింపు: జెలెన్‌స్కీ
ఏండ్లుగా భీకరంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అంతుచిక్కని పరిస్థితి నెలకొన్న వేళ రష్యా అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకొస్తే యుద్ధాన్ని ముగించే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ మీడియా సంస్థ ‘స్కై న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
‘యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలి. అప్పుడే మేం కాల్పుల విరమణకు అంగీకరిస్తాం. అలా జరిగితే రష్యా ఆక్రమణలో ఉన్న మా భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలుంటుంది’ అని జెలెన్‌స్కీ వెల్లడించారు.






