15-02-2026 12:35:57 AM
పాపన్నపేట, ఫిబ్రవరి 14: మంజీరా ‘ఏడు’ పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధమైన ప్రాంతం..నల్ల సరపు రాతిపై చెక్కిన అమ్మవారి రూపం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం.
నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వనదుర్గమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. దీంతో అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 800 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో సహస్ర చండీయాగం నిర్వహించినట్లు, 1870లో కాశీనాథ యోగేంద్రులు ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. మహాశివరాత్రికి ఇక్కడ మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు.
ఏడు పాయల్లో ఒకటైన నదీపాయ ఒడ్డున స్వయంభుగా వెలసిన అమ్మవారిని లక్షలాదిమంది భక్తులు వీక్షించి తరించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వనదుర్గామాతకు పట్టు వస్త్రాల సమర్పణతో సంబురం ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిర్వహించే ఈ మహాజాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వనజాతరకు తరలివస్తారు. సుమారు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా. మహాశివరాత్రి పర్వదినాన వేకువజామున 4 గంటలకు రాతి గుహలో కొలువుదీరిన వనదుర్గామాతకు పంచామృతాభిషేకం, అలంకారం, సహస్రనామ కుంకుమార్చనతో మహా జాతర ప్రారంభమవుతుంది.
జాతరలో ప్రధాన ఘట్టమైన కార్యక్రమం రెండో రోజు సోమవారం ఎడ్ల బండ్ల ప్రదర్శన ఉంటుంది. చివరి రోజు మంగళవారం రథోత్సవంతో మహాజాతర ముగుస్తుంది. మహాజాతరకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు 400 స్పెషల్ బస్సులను నడుపుతున్నారు.
టేకులగడ్డ నుంచి ఆలయం వరకు 10 మినీ బస్సులను ఉచితంగా నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. టేకులగడ్డ, నాగసానిపల్లి, నర్సాపూర్, బాలానగర్, మెదక్ తదితర ప్రాంతాల్లో బస్సు పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 24 గంటలపాటు, మంగళవారం రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురయ్యే భక్తులకు సేవలందించడానికి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది.
ఐదు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌తో పాటు 250 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించడానికి మూడు 108 అంబులెన్స్‌లు, 102 వాహనాలు రెండు, 104 ఒకటి అందుబాటులో ఉంటాయి. వనదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారు సాఫీగా తిరిగి వెళ్లడంలో పోలీసులదే కీలకపాత్ర.
ఈ మేరకు ఆలయం ఆధ్వర్యంలో వారు పక్కా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏం జరిగినా తెలిసేలా జాతర చుట్టూ నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. 800 పైచిలుకు పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మద్యం అమ్మకాల నిర్వహణకు చర్యలు చేపట్టారు.