calender_icon.png 15 February, 2026 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన ధర్మమే శైవ మతం

15-02-2026 12:43:02 AM

హైందవ సంస్కృతిలో శైవమతానికి ప్రత్యేకత

  1. ద్వుతైం, అద్వుతైం, వీరశైవం వంటి శాఖల సంప్రదాయం
  2. వైష్ణవ మతం కంటే ముందుగానే శైవ మతం విస్తరణ 

* శైవ మతం ప్రాచీన, వేద, స్థానిక సాంప్రదాయాల సమ్మేళనం. భారత హైందవ సంస్కృతిలో  శైవం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్వర్ణ వ్యవస్థ కలిగిన భారత హిందూ సమాజం శూద్రులు, అతిశద్రులను దేవుళ్ల దగ్గర కూడా అంటరాని వారిని చేసింది. కానీ ఇదే భారతదేశంలో అతి పురాతనమైన మతంగా విరాజిల్లుతున్న శైవ మతం అన్ని కులాలను అక్కున చేర్చుకున్నది. ఆత్మపరిశీలన ద్వారా ఆత్మ-పరమాత్మల ఐక్యతను శైవ మతం విశదీకరించడమే దీనికి కారణం.  

దక్షిణ భారతదేశంలో ద్రావిడ సంస్కృతి ప్రభావంతో వైష్ణవ మతం కంటే ముందుగానే శైవ మతం బలంగా విస్తరించింది. శైవ మత సిద్ధాంతానికి దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పొరుగున ఉన్న శ్రీలంక వంటి దేశంలో బలమైన పునాదులు పడ్డాయి. శైవ మతం అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకటి. వేదాలు మూలాలుగా గల అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఆ వేదాలు చతుర్ముకుడైన బ్రహ్మకు పరమశివుడే ఉపదేశించాడు అంటారు. కాబట్టి వేదాలు వాటి నుంచి వెలువడిన శృతి, స్మృతులు, పురాణాలు అన్ని ప్రథమంగా శివుని చేత బ్రహ్మదేవుడికి తెలుపబడింది అన్నమాట.

శివుడే పురాణ కథానాయకుడు

మహాభారతంలోని శాంతి పర్వంలో అష్టాదశ పురాణాం దశబిః కథ్యతే శివ: అని పేర్కొన్నారు. అష్టాదశ పురాణాల్లో పది పురాణాలు శివుని కథలతో నిండి ఉన్నాయంటేనే శివుడే పురాణ కథానాయకుడు అని తెలిసిపోతుంది. పురాణాలు అలాగే సనాతనధర్మం వేదాలు, ప్రాచీనగ్రంథాల నుంచి ఉద్భవించిన అత్యంత ప్రాచీన వైధిక ధర్మంగా, పూర్వ ఆర్య సంప్రదాయాలు,  వేదాల్లోని రుద్రుడి ఆరాధన నుంచి శైవం ప్రాచుర్యంలోకి వచ్చిందని చెపుతారు. శైవమతం శివుడిని సర్వోన్నత దేవుడిగా ఆరాధించే పురాతన అతిపెద్ద సంప్రదాయం. శైవమతంలో శైవ సిద్ధాంతం ( ద్వుతైం ) కాశ్మీరీ శైవం ( అద్వుతైం), వీరశైవం వంటి వివిధ శాఖల సంప్రదాయాలు ఉన్నాయి. సృష్టి స్థితి లయకారుడిగా శివుడిని ఆరాధిస్తారు. 

వేదాలకు పూర్వమే శివధ్యానం

శివుని ఆరాధనకు శివాలయం ప్రధాన కేంద్రం. మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అందునా మన తెలంగాణలో  శైవ మతం చారిత్రకంగా కాకతీయుల కాలంలో బలంగా విస్తరించింది. శైవ మతం దాని ఆచారాలు పూర్వకాలం నుంచి  భారతదేశంతో పాటు నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో బలంగా వేల్లూనుకుపోయి ప్రజలలో విడదీయరాని విశ్వాసాన్ని పాదుకొల్పాయనేది నిజం. ఇక యోగా, ధ్యానం, భక్తి, ఆగమశాస్త్రాలకు శైవం ప్రాధాన్యతనిస్తుంది. శివుడు వేదాలకు పూర్వమే పూజించబడ్డాడని తెలుస్తోంది. 

సింధూ నాగరికత వరకు శైవ మత మూలాలు

 క్రీ,, పూ 200, క్రీ,,శ 100 సం,,ల మధ్యకాలంలో రూపు దిద్దుకున్నాయి. శైవ మత మూలాలు క్రీ,,పూ 2500--2000 మధ్యకాలంలోని సింధూ నాగరికత (పశుపతి ముద్రిక ) వరకు విస్తరించి ఉన్నాయని చెప్పాలి. ఋగ్వేదం ( క్రీ,,పూ1500-1200)లో రుద్ర ప్రస్తావన మొదటి స్పష్టమైన ఆధారం కాగా, పాణిని మహాభాష్యం (క్రీ,,పూ 2వ శతాబ్దం) శివ భాగవతుల గురించి ప్రస్తావించడం గమనార్హం.

ప్రధానంగా ప్రాచీన మధ్యయుగ భారతదేశంలో పల్లవ, చోళ, రాష్ట్ర కూట, కాకతీయ, కళ్యాణి చాళుక్య వంశాల రాజులు శైవ మతాన్ని రాజ ధర్మంగా స్వీకరించి శైవ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా శైవ మత ఉద్యమాలకు ఊతమిచ్చి భారీ శివాలయాలను నిర్మించి శైవ మత వైభవాన్ని చాటిచెప్పారు. శైవ సిద్ధాంతం ద్వంద తత్వాన్ని బోధిస్తుంది. ఆత్మ శివుని అనుగ్రహంతో జ్ఞానోదయం పొందటం దీని అంతిమ లక్ష్యం.  దక్షిణ భారతదేశంలో ద్రవిడ సంస్కృతి నేపథ్యంలో అత్యధిక జనాభా కలిగిన శూద్ర, అతిశూద్ర వర్గాల ప్రజలు అనాదిగా శైవ మతాన్ని ఆచరిస్తుండడంతో అనాదిగా విరాజిల్లుతోంది.                                               

 ధీరన్ కొడారి , (8008200664)

 శివరాత్రి విశిష్టత   

     ’ఓం నమశ్శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం పరబ్రహ్మమయం. ఈ మంత్ర మహిమ గురించి ఈశ్వరుడే స్వయంగా చెప్పాడని మన పురాణాలు చెబుతున్నాయి.  ఈ మంత్రం పలికినవారికి ఎంత ఫలం కలుగుతుందో, విన్నవారికి కూడా అంతే ఫలితం కలుగుతుందని, తెలిసీతెలియక చేసిన పాపాలు, దోషాలు తొలగిపోయి సుఖాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.  శివరాత్రినాడు  అర్ధరా త్రి సమయంలో లింగరూపంలో ఆవిర్భవించిన శివుని దివ్యరూపం కోటి కాంతులతో ప్రజ్వరిల్లుతుంది.  లింగోద్భవ సమయంలో శివారాధనకు ప్రాధాన్యతనిచ్చారు.

శుభకరమైన శివరాత్రి రోజు శివపార్వతులు కైలాసంలో ఆనం దతాండవం చేసే శుభ సమయాన కోరిన కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్ముతారు. ఈ రో జున పవిత్ర స్నానాలు, అభిషేకాలు, ఉపవాసం ఉంటూ జాగా రం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్ర హం కలుగుతుందని భక్తుల నమ్మకం.  శివరాత్రి రోజు  అను క్షణం ’ఓం నమః శివాయ’ అనే శివపంచాక్షరి మంత్రాన్ని పటిస్తూ, మనసును పవిత్రంగా ప్రశాంతంగా ఉంచుకోవాలని శివతత్వం బోధిస్తోంది. 

కాయల నాగేంద్ర,(8500286687)

అంతరంగ అభిషేకం

కైలాస శిఖరాన కాదు కాపురం!

నీ హృదయ మందిరంలో ఉంది శివ రూపం!!

ప్రేమ గంగను ప్రవహింపజేసేదే శివత్వం!

నిరాడంబరమే నిరాకారుడు చూపే మార్గం!!

సంపదల వెనుక పరుగులు తీయక!

సమతతో సాగడమే అసలైన యోగం.!!

ఆకాశమే  హరుడు అంబరం!

ప్రకృతే పరమశివుడి ప్రాణవాయువు!!

దేహం ఈశ్వరుడు ఆలయమైతే..!

నీ ప్రవర్తనే స్వామికి చేసే అభిషేకం!!

నీ నిర్మలమైన ప్రేమే నువ్వు సమర్పించే నైవేద్యం!

మనసుల మధ్య వారధి కావడమే శివార్చన!!

బయట వెలిగే దీపం కన్నా!

లోపల వెలిగే జ్ఞానజ్యోతి మిన్న!!

శివుడిని స్మరించడమే కాదు..!

శివుడిలా జీవించడమే సార్థకత.!!

‘మనిషిగా పుట్టడం ఒక అవకాశం

 శివత్వాన్ని చేరుకోవడం ఒక లక్ష్యం.‘

డా.పూసపాటి వేదాద్రి, 9912197694