నిజాలెందుకు దాచారు?
హేమంత్ సోరెన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, మే 22 : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాలు దాచిపెట్టి మధ్యంతర బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆక్షేపించింది. మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ఆదేశించింది. ఆయన చార్జిషీట్‌పై ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని దాచిపెట్టి సుప్రీంలో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పు బట్టింది. జస్టిస్ దీపాంకర్ దత్త, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు వేయడం వల్ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ట్రయల్ కోర్టు హేమంత్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నిక ల ప్రచారానికి మధ్యంతర బెయిల్ ఎలా ఇవ్వగలమని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో చార్జిషీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టు మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోరెన్‌కు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీంతో, సుప్రీం ఆదేశాలతో మధ్యంతర బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు హేమంత్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. కాగా, జార్ఖండ్‌లో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోరేన్‌ను జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.






